దేఖ్ లేంగే పాటకు కేటీఆర్ స్టెప్స్.. కార్యకర్తల్లో జోష్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార హోరు కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 6 Nov 2023 3:15 PM GMTదేఖ్ లేంగే పాటకు కేటీఆర్ స్టెప్స్.. కార్యకర్తల్లో జోష్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార హోరు కొనసాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ప్రజల వద్దకు వెళ్లి తాము మున్ముందు ఇంకే చేస్తామో చెబుతూనే.. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో.. ఎక్కడ చూసినా ర్యాలీలు.. సభలు.. పాదయాత్రలు.. మొత్తం రాజకీయ పార్టీల హంగామా కనిపిస్తోంది. ఆయా పార్టీల అభ్యర్థులు ఎలాగైనా గెలిచేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే తమతమ స్టైల్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. కొందరైతే వినూత్నంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
బీఆర్ఎస్ నాయకులు అటు ప్రచారంలో బ్రేక్ లేకుండా పాల్గొంటూ.. మూడో సారి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రచార ముమ్మరంగా చేస్తూనే కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. షేర్ బ్యాండ్‌తో నేతలంతా కొత్త ప్రచారానికి తెర తీయగా.. దీన్ని చాలా మంది ఫాలో అవుతూ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. ఎప్పుడూ ప్రత్యర్థులపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ.. వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకునే కేటీఆర్ కూడా స్టేజి మీదే స్టెప్పులేసి.. కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ అరుదైన సన్నివేశానికి ఎల్లారెడ్డిపేట సభ వేదికైంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగానే మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డి పేటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో ప్రసంగించే ముందే అప్పటివరకు మారుమోగిన పాట గురించి ప్రస్తావించారు. దేఖ్ లేంగే పాట విన్నారా అంటూ సభలో ఉన్న జనాలకు అడిగారు. ఇంకోసారి ఆ పాట వినిపించాలంటూ డీజేను అడగ్గా.. వారు వెంటనే ప్లే చేశారు. ఇంకేముందు అదే స్టేజ్‌పై ఉన్న ఇతర నేతలు కేటీఆర్‌ను ముందుకు తీసుకొచ్చి స్టెప్పులు వేయించారు. దేఖ్ లేంగే అనే పాటకు చూపుడు వేలు చూపుతూ స్టెప్పులేశారు కేటీఆర్. దాంతో.. కార్యకర్తలు ఫుల్ ఖుషీ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రచారంలో భాగంగా.. ఇప్పటికే "గులాబీ జెండాలే రామక్క" పాట ఓ ఊపు ఊపేస్తుండగా.. ఇప్పుడు ఈ "దేఖ్ లేంగే" సాంగ్ కూడా జోరందుకుంటోంది.
KTR anna Dance ♥ 🔥#KTR #KTRBRS #KTRTRS #BRSParty #KTRstatus #KTRSpeech #KtrAnnaBRS #KTRAnna #KCR #CMKCR #JaiTelangana #Telangana pic.twitter.com/xig2O1KTgT
— KTR BRS (@KTRannaBRS) November 6, 2023