తూర్పుగోదావరి జిల్లా కడియంలో పెళ్లి వేడుకలో వధువును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం సృష్టించింది. కడియంలో పెళ్లి వేడుకలో కారంపొడి చల్లి వధువును అపహరించే ప్రయత్నం చేశారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం గొడిగనూరుకు చెందిన గంగవరం స్నేహ, కడియంకు చెందిన బత్తిన వెంకటానందులు నరసరావుపేటలోని ఓ కళాశాలలో వెటర్నరీ డిప్లొమా చదివారు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.
జంట కడియం వచ్చి బత్తిన వెంకటానందుని కుటుంబసభ్యులకు సమాచారం అందించగా పెద్దలు అంగీకరించి ఈనెల 21న బంధువుల సమక్షంలో మరోసారి వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని వధువు తల్లిదండ్రులకు చెప్పింది. అయితే వధువు తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించలేదు. ఆదివారం తెల్లవారుజామున కడియంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి వేడుక జరుగుతుండగా, వధువు బంధువులు హాల్లోకి చొరబడి ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు.
వెంటనే పెళ్లికొడుకు బంధువులు కిడ్నాప్ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడి, అపహరణ, బంగారం చోరీ తదితర ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.