దేశ రాజధాని ఢిల్లీలో ఊహించని ఘటన జరిగింది. సీఎం రేఖాగుప్తా కాన్వాయ్‌కు పశువులు అకస్మాత్తుగా అడ్డురావడంతో ఆమె కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం సీఎం రేఖా గుప్తా హైదర్‌పూర్ ఫ్లై ఓవర్‌పై వెళ్తుండగా కాన్వాయ్‌కు పశువులు అడ్డుగా రావడాన్ని గమనించిన వాహనాల డ్రైవర్లు సీఎం కాన్వాయ్‌ను నిలిపివేశారు. దీంతో సీఎం రేఖా గుప్తా కాన్వాయ్ అత్యవసరంగా ఆగిపోయింది. అయితే సీఎం కాన్వాయ్‌కు పశువులు అడ్డుగా వచ్చిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తన వాహనం నుంచి బయటికి వచ్చి కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చిన ఆవులను పరిశీలించారు. అధికారులతో కలిసి ఫ్లైఓవర్‌పై కొంత దూరం నడిచారు. రోడ్డుపైకి పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత తన నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలను ఆమె సందర్శించారు. పలు వార్డులను పరిశీలించారు. సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
అయితే ఇటీవలే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆమె సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. ఢిల్లీ రోడ్లపై పశువుల సంచారం ఎక్కువై, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే గోశాలలకు రూ.40 కోట్లు కేటాయించారు.