ఒక్క సంఘటన.. సీఎం రేవంత్‌ను పొగిడేస్తున్న నెటిజన్లు

ఓ మహిళ సీఎం రేవంత్‌రెడ్డిని ఆప్యాయంగా పిలిచింది. ఆ తర్వాత రేవంత్‌ కూడా ఆ గొంతు విని వెనక్కి వెళ్లి మరి మాట్లాడారు.

By Srikanth Gundamalla  Published on  11 Dec 2023 12:35 PM IST
cm revanth reddy, hospital, viral video,

ఒక్క సంఘటన.. సీఎం రేవంత్‌ను పొగిడేస్తున్న నెటిజన్లు 

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ ఇటీవల తన ఇంట్లో కాలు జారి కిందపడి గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే.. ఆయన ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం కేసీఆర్‌ను తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో ఓ మహిళ సీఎం రేవంత్‌రెడ్డిని ఆప్యాయంగా పిలిచింది. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి కూడా ఆ మహిళ గొంతను విని వెనక్కి వెళ్లి మరి మాట్లాడారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రేవంతన్న సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఆదివారం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం వచ్చారంటే మామూలుగానే పోలీసులు భద్రతా చర్యల్లో భాగంగా అందరినీ ఆపేస్తారు. ఆయన వెళ్తున్న సమయంలో అక్కడ చుట్టుపక్కల ఎవరూ తిరగకుండా చూస్తారు. ఇదే విధంగా ఆస్పత్రిలో కూడా చేశారు. అయితే.. ఇతర పేషెంట్లు, వారి బంధువులు సీఎం రేవంత్‌రెడ్డి ఆస్పత్రికి వచ్చాడన్న విషయం తెలుసుకోవడంతో ఆయన్ని చూసేందుకు గుమిగూడారు.

కేసీఆర్‌ను పరామర్శించిన తర్వాత రేవంత్‌రెడ్డి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే గుంపులో నుంచి ఓ మహిళ రేవంత్‌ అన్న అంటూ ఆప్యాయంగా పిలిచింది. ఆ గొంతు విన్న సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే నడకను ఆపి.. తిరిగి వెనక్కి వెళ్లారు. సుదురు మహిళ వద్దకు వెళ్లి సమస్య ఏంటని ఆరా తీశారు. అయితే.. తన కూతురు ఆరోగ్యం బాగోలేదని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పింది. చికిత్స కోసం చాలా ఖర్చు అవుతోందని.. తమ వద్ద అంత స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించింది. సదురు మహిళ ఆవేదన, బాధను అర్థం చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆమెకు తగిన సాయం చేయాలని.. సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఒక్క సంఘటనతో రేవంతన్న మనసు అర్థమైందనీ.. ఆయన మనసున్న మారాజు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Next Story