అన్నం అడిగితే అమ్మ కొడుతోంది.. పోలీసులకు చిన్నారి ఫిర్యాదు.. వీడియో వైరల్
Child complains to police against mother over food.ఓ చిన్నారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తల్లిపై ఫిర్యాదు చేశాడు.
By తోట వంశీ కుమార్ Published on 14 Sept 2022 11:05 AM IST
ఎక్కడైనా చిన్నారులు పోలీసులను చూస్తే చాలు ఆమడ దూరం పరిగెత్తుతుంటారు. కానీ ఓ చిన్నారి మాత్రం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తల్లిపై ఫిర్యాదు చేశాడు. ఇంతకి ఆ చిన్నారి ఏమని కంప్లైట్ చేశాడని అంటారా..? తనకు అన్నం పెట్టడం లేదని, అడిగితే కొడుతుందని ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సీతామడి పోలీస్ స్టేషన్ కు ఎనిమిదేళ్ల బాలుడు ఏడుస్తూ వచ్చాడు. ఆ బాలుడిని సముదాయించిన పోలీసులు ఏం జరిగిందని అడిగారు. అన్నం అడిగితే అమ్మ కొడుతోందని, సమయానికి పెట్టడం లేదని చెప్పాడు. ఆ చిన్నారిని చూసి ఏమి చేయాలో కాసేపు అక్కడి వాళ్లకి అర్థం కాలేదు. బాలుడికి కడుపు నిండా అన్నం పెట్టారు. అనంతరం అతడి వివరాలను ఆరా తీశారు.
తాను నాలుగో తరగతి చదువుతున్నట్లు ఆ బాలుడు చెప్పాడు. తన తండ్రి మరో చోట ఉంటాడని, తాను తల్లితో కలిసి ఉంటున్నట్లు తెలిపాడు. బాలుడిని పోలీసులు ఇంటికి తీసుకువెళ్లారు. చిన్నారి తల్లితో మాట్లాడగా అలాంటిది ఏమీ లేదని చెప్పింది. అప్పుడప్పుడు అల్లరి చేస్తాడని, ఆ సమయంలో కాస్త మందలిస్తానని తెలిపింది. చిన్నారిని బాగా చూసుకోవాలని, సమయానికి భోజనం పెట్టి పాఠశాలకు పంపించాలని తల్లికి పోలీసులు సూచించారు.
आठ वर्ष का बच्चा पहुंचा थाने में अपने माँ के खिलाफ शिकायत लेकर।बोला खाना मांगता हूं तो पिटायी करती है।#Sitamadhi #Bihar pic.twitter.com/WuvYuAu10P
— Mukesh singh (@Mukesh_Journo) September 13, 2022
బాలుడు పోలీసులకు కంప్లైట్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.