కరెన్సీ నోట్ల కట్టలు పెద్ద మొత్తంలో మురుగు నీటి కాల్వలో కనిపించాయి. ఇంకేముంది ఇది చూసిన స్థానికులు.. ఆ కరెన్సీ కోసం ఎగబడ్డారు. మురుగునీటి కాల్వలోకి దిగి మరి డబ్బులు తెచ్చుకున్నారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. రోహ్‌తాస్ జిల్లాలో శనివారం మొరాదాబాద్ గ్రామంలోని డ్రెయిన్ నుండి అనేక మంది వ్యక్తులు కరెన్సీ నోట్లను డ్రైనేజీ కాల్వ నుంచి బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ చాలా మంది వ్యక్తులు డ్రెయిన్‌లోకి ప్రవేశించి రూ. 2,000, రూ. 500, రూ. 100, రూ. 10 డినామినేషన్‌లోని కరెన్సీ నోట్లను సేకరించారు. తెల్లవారుజామున డ్రెయిన్‌లో కరెన్సీ నోట్ల సంచులు కనిపించాయని స్థానిక గ్రామస్తులు తెలిపారు. కాసేపటికే పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకుని నోట్లను సేకరించడం ప్రారంభించారు. ఆ నోట్లు నిజమైనవేనని కూడా వారు పేర్కొన్నారు. కరెన్సీ నోట్లు నిజమైనవేనా, వాటిని ఎవరు కాలువలో పడవేశారనే దానిపై జిల్లా యంత్రాంగం ఆరా తీస్తోంది.