హైదరాబాద్: ఇటీవల కాలంలో గుండె పోటు మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా క్రికెట్ ఆడుతూ ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ సీఎంఆర్ కాలేజీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి కాలేజీ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్నాడు.
గ్రౌండ్‌లో ఫీల్డింగ్‌లో ఉన్న సమయంలో వినయ్ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వినయ్ అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. అప్పటిదాకా తమతో క్రికెట్ ఆడిన తమ స్నేహితుడు కళ్ల ముందే కుప్పకూలిపోయి మృతి చెందడంతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురై, కన్నీరు మున్నీరు అయ్యారు. కాగా వినయ్ గుండెపోటుతో కుప్పకూలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.