అది మెర్సిడెస్ బెంజ్ కారు.. ఉన్నపలంగా సాంకేతిక సమస్యతో రోడ్డుపై ఆగిపోయింది. దీంతో ఆ కారును షెడ్డుకు తరలించేందుకు ఓ ఆటో డ్రైవర్ సాయం చేశాడు. మనం సాధారణంగా ఆగిపోయిన ఆటోను, బైక్‌ను మరో వాహనం సాయంతో వెనుకవైపు నుంచి కాలితో ఎలా తోసుకుంటూ రిపేర్ షాపుకు తీసుకెళ్తామో.. అచ్చం అలాగే బెంజ్ కారును ఆటో డ్రైవర్ షెడ్డుదాకా కాలితో తోసుకువెళ్లాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలోగల కోరేగావ్క్ పార్క్ ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కోరేగావ్ పార్క్ ప్రాంతంలో గల ఓ రద్దీ రోడ్డుపై బెంజ్ కారు ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ కాలేదు. దీంతో కారు డ్రైవర్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరైనా సాయం చేస్తారేమో అని ఎదురు చూపులు చూడసాగాడు. అయితే సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అందరూ తమతమ పనుల్లో నిమగ్నమై వెళ్తూ కనిపించారు. అంతలో అటుగా ఓ ఆటో వచ్చింది. ఆ ఆటో డ్రైవర్ అక్కడ పరిస్థితిని గమనించి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. వెనుక ఆటో నడుపుతూ తన కాలితో బెంజ్‌కారును తోసుకుంటూ షెడ్డుదాగా చేర్చాడు. ఈ తతంగాన్నంతా రోడ్డుపై వెళ్తున్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.