చిన్న పిల్లలను ఒక వయస్సుకు వచ్చే వరకు.. ఓ కంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే వారి చేసే అల్లరి పనులు.. వారి ప్రాణాల మీదకు తెస్తాయి. తాజాగా వనపర్తి జిల్లాలో ఏడాదిన్నర వయసున్న బాలుడు చేసిన పని అందరినీ షాక్‌కు గురిచేసింది. వంటపాత్రలో తల ఇరుక్కుపోవడంతో గట్టిగా బాలుడు ఏడుపు అందుకున్నాడు. చివరికి కట్టర్ సాయంతో బాలుడిని రక్షించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
జిల్లాలోని కొత్తకోట మండలం అప్పరాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రమ్మ, చెన్నయ్య దంపతులకు ఏడాది వయసు కొడుకు ఉన్నాడు. ఇంట్లో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా.. బాలుడి వంట పాత్రతో ఆడుకుంటుడగా.. ప్రమాదవశాత్తు వంట పాత్రలో బాలుడి తల ఇరుక్కుపోయింది. వెంటనే అతడు ఏడుపు లంకించుకున్నాడు. అతడి ఏడుపులు విన్న కుటుంబ సభ్యులు.. అతడి తల వంట పాత్రలో ఇరుక్కుపోవడంతో ఆందోళన చెందారు.
దీంతో బాలుడి తలను వంట పాత్రను తీసే ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాకపోవడంతో బాలుడిని గ్రామానికి చెందిన కమ్మరి వద్దకు తీసుకెళ్లారు. అతడు గంటపాటు కష్టపడి కట్టర్‌తో వంట పాత్రను కట్ చేసి అతనిని రక్షించారు. గంటపాటు నరకం అనుభవించిన చిన్నారికి ఆ పాత్ర నుండి విముక్తి లభించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. పిల్లలు పాత్రలతో ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లు కోరుతున్నారు.