Video: పెన్షన్‌ కోసం వృద్ధురాలు.. విరిగిన కుర్చీ సాయంతో, చెప్పులు లేకుండా కి.మీల నడక

70 ఏళ్ల సూర్య హరిజన్.. తన పింఛన్ డబ్బు కోసం అనేక కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడిచిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో

By అంజి  Published on  21 April 2023 7:15 AM GMT
SBI, old woman,  pension, Odisha, Nabrangpur

Video: పెన్షన్‌ కోసం వృద్ధురాలు.. విరిగిన కుర్చీ సాయంతో, చెప్పులు లేకుండా కి.మీల నడక 

70 ఏళ్ల సూర్య హరిజన్.. తన పింఛన్ డబ్బు కోసం అనేక కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడిచిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వృద్ధురాలు పడుతున్న అవస్థ.. అందరనీ చలింపజేసింది. ఈ ఘటనపై స్పందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియోలో.. వృద్ధ మహిళ తన పెన్షన్ డబ్బును తీసుకునే క్రమంలో విరిగిన కుర్చీతో మండుతున్న వేడికి చెప్పులు లేకుండా నడుస్తున్నట్లు చూడవచ్చు. ఏప్రిల్ 17న ఒడిశాలోని నబ్రంగ్‌పూర్ జిల్లా ఝరిగావ్ బ్లాక్‌లో ఈ ఘటన జరిగింది.

చాలా పేదవాడని చెప్పిన మహిళ పెద్ద కుమారుడు ఇప్పుడు వేరే రాష్ట్రంలో వలస కూలీగా పనిచేస్తున్నాడు. ఆమె ఇప్పుడు తన చిన్న కొడుకుతో ఉంటోంది, జీవనోపాధి కోసం ఇతరుల పశువులను మేపుతుంది. అయితే అంతదూరం నడుచుకుంటూ పింఛను తీసుకునేందుకు బ్యాంకుకు వచ్చిన వృద్ధ మహిళకు బ్యాంకు అధికారులు పెన్షన్‌ ఇవ్వలేదు. బొటన వేలి రికార్డులకు సరిపోలడం లేదని అధికారులు చెప్పడంతో వృద్ధురాలు తిరిగి ఇంటికి రావాల్సి వచ్చింది.

ఈ సంఘటనపై ఎస్‌బీఐ యొక్క ఝరిగావ్ బ్రాంచ్ మేనేజర్ స్పందిస్తూ.. వృద్ధ మహిళ "వేళ్లు అరిగినందున" డబ్బును విత్‌డ్రా చేయడంలో ఇబ్బంది పడుతున్నారని, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి బ్యాంక్ కృషి చేస్తోందని తెలిపారు. ''వృద్ధాప్యం కారణంగా ఆమె వేలిముద్రలు సరిపోలడం లేదు. ఇకపై ఇంటింటికి పింఛను పంపిణీని సులభతరం చేయాలని మేము నిర్ణయించుకున్నాము. త్వరలో ఆమెకు వీల్ చైర్ అందజేస్తాం'' అని చెప్పారు.

Next Story