Fact Check : అర్నాబ్ గోస్వామిని పోలీసులు టార్చర్ చేస్తున్నట్లుగా పోస్టులు వైరల్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2020 8:53 AM GMT
Fact Check : అర్నాబ్ గోస్వామిని పోలీసులు టార్చర్ చేస్తున్నట్లుగా పోస్టులు వైరల్..!

రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-ఛీఫ్ అర్నాబ్ గోస్వామిని నవంబర్ 4న అరెస్టు చేశారు. ఆర్కిటెక్చర్-ఇంటీరియర్ డిజైనర్ అయిన అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదిని ఆత్మహత్య కేసును బాధిత కుటుంబం అభ్యర్థనపై తిరిగి ఓపెన్ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం అర్నాబ్ గోస్వామి, ఫిరోజ్ షేక్, నితేశ్ సర్దాలను అరెస్ట్ చేసి అలీబాగ్ కోర్టులో ప్రవేశపెట్టారు. అర్నాబ్‌ను పోలీసు కస్టడీకి అప్పగించాలంటూ చేసిన అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. 2018లో ముంబైలో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ మృతి కేసులో అర్నాబ్ ను అరెస్టు చేశారు.



పోలీసులు అర్నాబ్ ను కొట్టారంటూ కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఓ ఫోటోలో కింద పడుకుని ఉన్న వ్యక్తి అర్నాబ్ గోస్వామి అంటూ పలువురు పోస్టులు పెడుతూ వస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ గోయల్ కూడా ఆ ఫోటోను తన ఖాతాలో పోస్టు చేశారు. "Can't believe he is #ArnabGoswami. If it's real.....Maharashtra Govt has asked for the doomsday. I m terribly Perturbed." అంటూ ట్వీట్ చేశారు. ఆ ఫోటోలో ఉన్నది అర్నాబ్ గోస్వామి అయితే మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ఈ ఫోటోలను నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పాడు. క్షణాల్లో ఈ పోస్టు వైరల్ అయింది.



ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.

నిజ నిర్ధారణ:

అర్నాబ్ గోస్వామిని పోలీసులు కొడుతున్నారన్నట్లుగా వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఘటన 2020 జనవరిలో చోటు చేసుకున్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి ఫోన్ ను దొంగతనం చేశాడన్న కారణంతో అతన్ని పోలీసులు చితకబాదారు. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది.

ఈ ఘటనపై న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా... జనవరి 10 2020న ఈ ఘటనకు సంబంధించిన కథనాన్ని News18 ప్రచురించింది. "Legs Held Up, Shoe on Face, Belt Buckle Beating: On Cam, UP Police's Punishment for 'Phone Thief'." అంటూ కథనాలు వచ్చాయి. ఫోన్ దొంగతనం చేశాడని ఆ వ్యక్తిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టారన్నది ఆ కథనం.

ఆర్టికల్ ప్రకారం 'ముగ్గురు పోలీసులు ఓ వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టారు. ఆ వ్యక్తి మొబైల్ ఫోన్ ను దొంగతనం చేశాడని పోలీసులు ఈ విధంగా ప్రవర్తించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని డియోరియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో వారిని సస్పెండ్ చేశారు. వారి మీద ఎఫ్.ఐ.ఆర్. కూడా నమోదు చేశారు' అని తెలిపారు.

NDTV లో కూడా ఈ ఘటనకు సంబంధించిన కథనం వచ్చింది. జనవరి 9న కథనాన్ని ప్రచురించారు.

ఈ కథనాలను బట్టి వీడియోలో ఉన్న వ్యక్తి అర్నాబ్ గోస్వామి కాదని స్పష్టంగా తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Next Story