'విక్రమా' ఎక్కడున్నావ్.. ఎన్నాళ్లని వెతకాలి.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2019 8:20 AM GMT
విక్రమా ఎక్కడున్నావ్.. ఎన్నాళ్లని వెతకాలి.!

అమెరికా: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్‌-2 ప్రయోగం చేపట్టింది. అయితే ఈ ప్రయోగం చివరి క్షణంలో విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా చంద్రుడి ఉపరితలంపై పడి ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌ను ఫొటోలు తీసేందుకు అమెరికా నాసా సంస్థ మరోసారి ప్రయత్నించింది. విక్రమ్‌ దిగినట్లుగా భావిస్తున్న ప్రాంతాన్ని నాసాకు చెందిన లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ అక్టోబర్‌ 14న ఫొటోలు తీసింది. అయితే ఈ తాజా చిత్రాల్లో విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీ కనిపించడం లేదని నాసా వెల్లడించింది. అయితే ఈ ఫొటోల్లో విక్రమ్‌ కనిపించకపోవడంతో శ్రాస్తవేత్తలు నిరాశకు గురయ్యారు. ఇన్ని రోజులైనా విక్రమ్‌ ల్యాండర్‌ ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఆక్షాంశం తక్కువగా ఉండటం వల్ల నిర్దేశిత ప్రాంతంలో ఎప్పుడూ నీడ ఉంటుంది. ఒక వేళ ల్యాండర్‌ ఆ నీడలో ఉండొచ్చు. లేదా నిర్దేశిత ప్రాంతానికి అవతలివైపు ఉండొచ్చని ఎల్‌ఆర్‌వో డిప్యూటీ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ జాన్‌ కెల్లర్‌ తెలిపారు.

మరోవైపు చంద్రుడి కక్ష్య చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ అక్కడి ఉపరితలంపై ఫొటోలను తీసి పంపింది. చంద్రుడిపై ఖనిజాలు, చంద్రుడి ఆవిర్భావం గురించి ఆర్బిటర్‌లోని స్పెక్ట్రోస్కోపిక్‌ పరికరం తొలి ఫొటోను తీసి పంపినట్టు ఇస్రో వెల్లడించింది. ఆర్బిటర్‌లోని పేలోడ్స్‌ చంద్రుడి గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.



Next Story