విజయవాడ: సందీప్, పండు గ్యాంగ్‌ల నగర బహిష్కరణ: డీసీపీ
By సుభాష్
బెజవాడలో రౌడీషటర్లపై నగర బహిష్కరణ విధించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నగర బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే గ్యాంగ్‌వార్ కేసులో పండు తల్లి పాత్ర ఎంత వరకు ఉందో విచారణ జరుపుతున్నామని అన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 37 మంది అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో 13 మంది కోసం గాలింపు చేపడుతున్నామన్నారు. ఈ రెండు గ్యాంగ్‌లను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు డీసీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ పండు గ్యాంగ్‌కు సంబంధించి 17 మంది, సందీప్ కుమార్ గ్యాంగ్‌కు సంబంధించి 16 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
అలాగే పండు, సందీప్ గ్యాంగ్‌ల మధ్య గొడవకు కారణమైన బిల్డర్లు ధనేకుల శ్రీధర్, ప్రదీప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి మధ్య ఉన్నవివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్న భట్టునాగబాబులను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు.