అప్పు చెల్లించాలని హిజ్రాల వేధింపులతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఏపీలోని విజయవాడ పరిధిలో చోటు చేసుకుంది. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తంబి దాసు, పద్మ దంపతులు. నగరంలోని ఓ హోటల్‌లో పనిచేస్తూ ఇద్దరు కుమార్తెలతో విజయవాడలోని డీమార్ట్ వెనుక బావాజీపేట 2వ లైన్‌లో నివాసం ఉంటున్నాడు. పెద్ద కూతురు ల్యాబ్‌లో పనిచేస్తుండగా, రెండో కుమార్తె తంబి అనురాధ (18) నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది.
ఇటీవల కుటుంబ సభ్యులు రూ.10 వేలు ఇంటి అవసరాల కోసం తెలిసిన హిజ్రా నుండి అప్పుగా తీసుకున్నారు. సకాలంలో అప్పు చెల్లించకపోవడంతో సోమవారం రాత్రి కొందరు హిజ్రాలు వారి ఇంటి ఎదుటకు వచ్చి అసభ్యకరంగా దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనురాధ మంగళవారం ఉదయం తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం 11.30 గంటల సమయంలో బాలిక అమ్మమ్మ కొమ్మూరి నరసమ్మ కూరగాయలు ఇచ్చేందుకు ఇంటికి వచ్చి చూడగా బాలిక ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది.
వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి స్థానికుల సహాయంతో వారిని కిందకు దించి ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణ తర్వాత.. ఏం జరిగిందనే దానిపై ఓ క్లారిటీ రానుంది.