రాజధాని భూముల వేలం.. కుదరని బేరం

When CRDA called to auction the lands in the capital Amaravati, the response was poor. అమరావతి రాజధాని భూములంటే ఒకప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి. పెట్టుబడిదారుల్లో భారీ డిమాండ్ ఉండేది. ఏమాత్రం

By సునీల్  Published on  15 Aug 2022 11:53 AM IST
రాజధాని భూముల వేలం.. కుదరని బేరం

* అమరావతిపై తగ్గిన ఆసక్తి

* అభివృద్ధి జరగదనే అభిప్రాయం

* నిధుల సమీకరణలో ఫలించని సీఆర్డీఏ ప్రయత్నాలు

అమరావతి రాజధాని భూములంటే ఒకప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి. పెట్టుబడిదారుల్లో భారీ డిమాండ్ ఉండేది. ఏమాత్రం అవకాశం ఉన్నా వీలైనంత భూమి కొనాలనే క్రేజ్ చుట్టుపక్కల జిల్లాల ప్రజల్లో కనిపించేది. అయితే ఇప్పుడదంతా రివర్స్ అయిపోయింది. రాజధాని అమరావతి ప్రాంతాల్లోని భూములను రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) వేలం వేయాలని పిలిస్తే స్పందనే కరువైంది.

కానరాని అభివృద్ధి

రాజధానిగా ప్రకటించిన అమరావతి ప్రాంతం, చుట్టుపక్కల కోట్లు పలికిన భూములు ఇప్పుడు బేరాల్లేక వెలవెలబోతున్నాయి. హైకోర్టు సూచించినా ప్రభుత్వం మాత్రం అక్కడ అభివృద్ధి పనులు పెద్దగా చేయడం లేదు. ప్రభుత్వానికి అసలు రాజధానిని అభివృద్ధి చేసే ఉద్దేశం లేదన్న భావన వ్యక్తమవుతోంది. అందుకే పెట్టుబడిదారులు ఎవరూ ముందుకు రావడం లేదు. సొంతంగా నిధులు సమీకరించుకోవాలని సీఆర్డీఏ చేస్తున్న ప్రయత్నాలు వర్కవుట్ కావడం లేదు.

వేలం.. వెలవెల

రాజధాని ప్రాంతంలోని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని సీఆర్డీఏ అధీనంలో ఉన్న స్థలాలను వేలం వేసేందుకు సిద్ధమైంది. జూన్ ఆరునే 389, 390 జీవోలూ విడుదలయ్యాయి. తెనాలి, పాయకాపురం, ఇబ్రహీపట్నం, నవులూరుల్లోని 56.2 ఎకరాల్లో వంద నివాస, వాణిజ్య ప్లాట్లను వేలం కోసం ప్రకటించారు. ప్రాంతాన్ని బట్టి చదరపు గజం ప్రారంభ ధరలను నిర్ధారించారు. తెనాలి చెంచుపేట టౌన్ షిప్‌లో రూ. 32 వేలు, నవులూరులో ఆప్ సెట్ ధర రూ. 16 వేలు, పాయకాపురంలో చదరపు గజం ప్రారంభ ధర రూ. 25 వేలు, ఇబ్రహీంపట్నంలోనైతే రూ. పది వేలుగా ప్రకటించారు. మూడేళ్ల క్రితం ఇంతకు రెట్టింపు చెప్పినా, కొనుగోలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వేలానికి వచ్చేవారే లేక వెలవెలబోతోంది.

ప్రచార ఖర్చులూ దండగే..

రాజధాని భూముల ఈ వేలం ద్వారా భారీగా ఆదాయం కూడగట్టాలనే ఆలోచనతో సీఆర్డీఏ విస్తృత ప్రచారం నిర్వహించింది. దాదాపు 50 లక్షల రూపాయల వరకు వెచ్చించి ప్రచారం చేపట్టింది. అలాగే వేలం జరిగే నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినా పెద్దగా స్పందన కనిపించలేదు. దీంతో ప్రచార ఖర్చులు కూడా గిట్టుబాటు కాలేదని అధికారులు వాపోతున్నారు. జూన్ ఆరున వేలానికి నోటిఫికేషన్ ఇస్తే.. గడువులోగా ముగ్గురంటే ముగ్గురే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఒకే ఒక్కరు ఆప్ సెట్ ధర కన్నా చదరపు గజానికి రూ. వంద చొప్పున ఎక్కువ బిడ్ వేశారు. ఈ వేలానికి వచ్చిన స్పందన చూసి సీఆర్డీఏ సిబ్బంది ముక్కున వేలేసుకున్నారు.

మళ్లీ ప్రయత్నిద్దాం..

రాజధాని ప్రాంత భూముల వేలానికి ఆశించిన స్పందన రాకపోవడంతో మరోసారి ప్రయత్నించాలని సీఆర్డీఏ భావిస్తోంది. తొలి విడతపై అనాసక్తికి కారణాలను అన్వేషిస్తోంది. రాజధాని ప్రాంతం పేరుతో అమరావతికి సంబంధం లేని చోట్ల వేలం నిర్వహించడం వల్లే బేరాలు రాలేదనే అభిప్రాయానికి వచ్చింది. అందుకే ఈసారి కోర్ క్యాపిటల్ పరిధిలోని 14 ఎకరాలను అమ్మకానికి పెట్టి సక్సెస్ కావాలని యోచిస్తోంది. గతంలో బీఆర్ షెట్టి మెడిసిటీకి ఇచ్చిన పదెకరాలు, ఇండో- యూకే ఇన్‌స్టిట్యూట్‌కు కేటాయించిన నాలుగెకరాలను వేలంలో పెట్టాలని నిర్ణయించింది. గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఆధ్వర్యంలో చర్చించి ఆప్ సెట్ ధరను ప్రకటిస్తారు.

Next Story