విజయవాడ ఎయిర్‌పోర్టు పనులు 2025 జూన్ నాటికి పూర్తీ చేస్తాం
విజయవాడ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయనున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
By అంజి Published on 28 July 2024 5:41 PM ISTవిజయవాడ ఎయిర్‌పోర్టు పనులు 2025 జూన్ నాటికి పూర్తీ చేస్తాం
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయనున్నట్లు ఇటీవల పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో తెలిపారు. రూ. 611.80 కోట్ల అంచనా వ్యయంతో విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం, అనుబంధ పనుల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్ట్ జూన్ 2020లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని లిఖితపూర్వక సమాధానంలో నాయుడు తెలిపారు.
పర్యావరణ అనుమతులు ఆలస్యంగా అందుకోవడం, COVID-19 మహమ్మారి, తుఫానులు, అధిక వర్షపాతం నమోదవ్వడం సహా ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యమైందని తెలిపారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక లభించకపోవడం కూడా ఆలస్యానికి కారణమని చెప్పారు. విజయవాడ విమానాశ్రయం పనులు ప్రాధాన్యత కింద చేపడుతున్నామని, 2025 జూన్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు.
ముఖ్యంగా తీసుకోవాల్సిన అనుమతులు, విమానాశ్రయానికి సంబంధించిన అడ్డంకులు లేకుండా చేసుకోవడం వంటి వివిధ అంశాలపై భవనం నిర్మాణం ఆధారపడి ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రాజెక్ట్ 48.5 శాతం భౌతిక పురోగతిని సాధించిందన్నారు. జూన్ 2024 వరకు రూ.279.93 కోట్లు ఖర్చు అయ్యాయని తెలిపారు. లోక్‌సభలో జనసేన ఎంపి వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.
గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ పాలసీ 2008 ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో మూడు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దగదర్తి విమానాశ్రయానికి రూ.293 కోట్లు, భోగాపురం విమానాశ్రయానికి రూ.4,727 కోట్లు, ఓర్వకల్ విమానాశ్రయానికి రూ.187 కోట్లు కేటాయించింది. ఓర్వకల్ విమానాశ్రయం మార్చి 2021లో ప్రారంభించారు.