ఏపీలో నేటి నుంచే రాత్రి కర్ఫ్యూ.. వీటికే మినహాయింపులు
Night Curfew in Andhrapradesh begins from Today.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి(మంగళవారం) నుంచి రాత్రి కర్ఫ్యూ
By తోట వంశీ కుమార్ Published on 18 Jan 2022 3:16 AMఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి(మంగళవారం) నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడికి నేటి నుంచి జనవరి 31 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. రాత్రి కర్ఫ్యూ తో పాటు కొన్ని నిబంధనలు కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రజలంతా మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధించనున్నారు.
పబ్లిక్ గేదరింగ్స్‌కు పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చింది. శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాల కోసం బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్ గేదరింగ్స్‌కు 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ఇక వాణిజ్య దుకాణాలు, మాల్స్ తదితర వాటిల్లో కొవిడ్ మార్గదర్శకాలు పాటించక పోతే రూ.10 వేల నుంచి 25 వేల వరకు జరిమానా విధించనున్నారు. సినిమా హాళ్లలో 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశించింది.
కర్ఫ్యూ నుంచి కొన్నింటికి మినహాయింపును ఇచ్చారు. ఆస్పత్రులు, ఫార్మసీ దుకాణాలు, పత్రిక, ప్రసార మాధ్యమాలు, టెలీ కమ్యూనికేషన్లు, ఐటీ సేవలు, విద్యుత్ సేవలు, పెట్రోల్ స్టేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, నీటి పారశుధ్య సిబ్బందికి మినహాయింపు ఇచ్చారు. వీరితో పాటు గర్భిణీలు, రోగులు, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు రాత్రి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఇక రాష్ట్రంలో కొత్తగా 4,108 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సోమవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,10,388కి చేరింది. కరోనా వల్ల నిన్న ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,510గా ఉంది. 24 గంటల వ్యవధిలో 696 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,65,696కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,182 యాక్టివ్ కేసులున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,18,84,914 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.