వైసీపీ నేతలకు లోకేశ్ వార్నింగ్.. 'నాన్న వదిలినా.. నేను వదలను'
Nara Lokesh fires on YCP Leaders.తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ నేతలపై మండిపడ్డారు
By తోట వంశీ కుమార్ Published on 22 Dec 2021 3:18 PM ISTతెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ నేతలపై మండిపడ్డారు. తన తల్లిపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులను వదలబోనని చెప్పారు. వారందరికి తగిన తీరులో బుద్ది చెపుతానన్నారు. తన తండ్రిలా తాను మెతక వైఖరితో ఉండనని.. గట్టిగా సమాధానం ఇస్తానన్నారు. మంగళగిరిలో పర్యటనలో ఉన్న లోకేష్ మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశాడు.
ఇటివల నారా భువనేశ్వరి ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి వరదల్లో మృతిచెందిన బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరుఫున ఆర్థికసాయం చేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై పలువురు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై నేడు నారా లోకేశ్ మండిపడ్డారు. ఆర్థికసాయం ఇవ్వడానికి వెళ్లిన మా అమ్మపై వ్యాఖ్యలు చేయడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'వరద బాధితులను ఆదుకోవడానికి మీరు ఏం చేశారు. మీరా నా తల్లిపై ఆరోపణలు చేసేది. ఒళ్లు దగ్గరపెట్టుకోండి. నేను చెబుతున్నా.. మీరు ఎక్కడ ఉన్నా నేను వదలి పెట్టను.. నా తండ్రి వదిలి పెడతారేమో.. ఆయనది చాలా పెద్ద మనసు. నేను మాత్రం వదలిపెట్టను. నా తల్లిపై ఆరోపణలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలకు తగి బుద్ధి చెబుతాను' అని నారా లోకేశ్ హెచ్చరించారు.
వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి, మా అమ్మ రూ.లక్ష చొప్పున సాయం చేశారు. వరదల సమయంలో ప్రజల్ని ఆదుకోవాల్సిన మంత్రులు విదేశాల్లో జల్సాలు చేశారని ఆరోపించారు. ప్రజలను ఆదుకున్న తమపై నిందలు వేస్తారా..? అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.