జగన్ తప్పులను చరిత్ర మరిచిపోదు : చంద్రబాబు
Nara Chandrababu Naidu slams YCP.వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని
By తోట వంశీ కుమార్ Published on 5 Jan 2022 1:49 PM ISTవైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలనలోనే ఏపీ తీవ్రంగా దెబ్బతిందన్నారు. జగన్ చేసిన తప్పులను చరిత్ర మరిచిపోదన్నారు. రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ది లేదని విమర్శించారు.
నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. పన్నులపై పన్నులు వేసి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. ఆఖరికి చెత్తపైనా పన్ను వేసే పరిస్థితికి వచ్చారన్నారు. ప్రభుత్వ విధానాలపై నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎవ్వరినీ వదిలి పెట్టకుండా వేధిస్తోందని.. బాధితుల తరఫున తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు. ఈ నెల 8న రైతుల సమస్యలపై పోరాటం చేపట్టాలని సూచించారు.
ఈ నెల 18న టీడీపీ సభ్య నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక టీడీపీకి ఈ ఏడాది చాలా ముఖ్యమన్నారు. పార్టీ తరఫున ఏం చేసినా ఈ ఏడాదే చేయాలన్నారు. వచ్చే ఏడాది ఎన్టీఆర్ జన్మించి వందేళ్లు అవుతుందని.. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పార్టీ కార్యకర్తలు ముందకు వెళ్లాలని సూచించారు. నాయకులు ధైర్యంగా లేకుంటే కార్యకర్తలు కూడా డీలా పడతారని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు అన్ని అంశాలపై ప్రణాళికలు వేసుకుని పోరాడాలని సూచించారు.