విద్యార్హతపై తప్పుడు ధ్రువపత్రం సమర్పించారని టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబును గురువారం అర్థరాత్రి సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుమారు 18 గంటల పాటు సీఐడీ పోలీసులు అశోక్‌బాబును తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. అనంతరం విజయవాడ సీఐడీ కోర్టుకు తరలించారు. కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి సత్యవతి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రూ.20వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో అశోక్‌బాబును పోలీసులు విడుదల చేశారు.
కాగా.. శనివారం టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ అశోక్‌బాబును పరామర్శించారు. విజయవాడ పటమటలోని అశోక్‌బాబు నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయనతో మాట్లాడారు. సీఐడీ అరెస్టు తదనంతర పరిణామాలపై చంద్రబాబు ఆరా తీశారు. కాగా అశోక్‌బాబును అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పీఆర్సీని వ్యతిరేకించిన ఉద్యోగులకు మద్దతుగా మాట్లాడినందుకే అశోక్‌బాబుపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని విమర్శలు చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.