జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో రేపు(సోమవారం) భారీ సభను నిర్వహించనున్నారు. ఈ సభ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జన సైనికులతో పాటు రాష్ట్ర క్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆవిర్భావ సభ సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయగా వాటిని తొలగించారు. దీనిపై వివాదం కొనసాగుతోంది.
విజయవాడ కనుక దుర్గ వారధిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అధికారులు తొలగించారు. విషయం తెలుసుకున్న జనసైనికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వారిపై మండిపడ్డారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అక్కడకు చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. పోలీసులు కావాలనే తమ పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలనుతొలగించారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అధికార నేతల ఒత్తిడితోనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.