ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 దుకాణాలు దగ్థం అయ్యాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
గురువారం అర్థరాత్రి దాటిన తరువాత తిరుపతమ్మ ఆలయ దుకాణ సముదాయంలోని ఓ దుకాణంలో తొలుత మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన స్థానికులు.. అధికారులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సర్పంచి, దేవస్థానం అధికారులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి మంటలను ఆర్పేందుకు సహకారం అందించారు. అయితే.. అప్పటికే 20 దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఘటనాస్థలిని ఆలయ ఈవో, ఛైర్మన్, తహశీల్దార్ పరిశీలించారు.
ఫిబ్రవరి 5 నుంచి తిరుపతమ్మ తిరునాళ్లు ఉండడంతో వ్యాపారులు భారీగా సామాగ్రిని కొనుగోలు చేసి దుకాణాల్లో నిల్వ ఉంచారు. ఒక్కొ షాపులో రూ.2లక్షల నుంచి రూ.3లక్షల సామాగ్రి ఆగ్నికి ఆహుతి కావడంతో పెద్ద మొత్తంతో నష్టం వాటిల్లినట్లు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం 20 దుకాణాల్లో సుమారు రూ.50లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు బావిస్తున్నారు.