పోలీసులకు 'వీక్లీ ఆఫ్' నా కోరిక : సీఎం జగన్
CM Jagan speech in Police Commemoration Day 2022.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల పనితీరు బాగా మెరుగుపడిందని
By తోట వంశీ కుమార్ Published on 21 Oct 2022 12:52 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల పనితీరు బాగా మెరుగుపడిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనందరి సైనికులే పోలీసులని, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
పోలీసుల పని తీరు బాగా మెరుగుపడిందని, మహిళలపై నేరాల విచారణకు సమయం కూడా చాలా తగ్గిందన్నారు. ఇక పోలీసులపై పని భారం తగ్గించేందుకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 6,511ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం వచ్చాక పోలీస్ వ్యవస్థలో మార్పులొచ్చాయన్నారు. దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్లు అందులో భాగమేనన్నారు.
కోటి 33లక్షల మంది ఫోన్‌లో దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారని, దీనిలో కోటి 15లక్షల మంది యాప్ రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యిందన్నారు. దిశ యాప్ ద్వారా 1237 చోట్ల రెస్క్యూ చేసినట్లు తెలిపారు. మహిళలు, దళితులను పోలీస్ శాఖ(హోంశాఖ)కు మంత్రులుగా నియమించి వాళ్లకు ప్రాధాన్యం విషయంలో ఎలాంటి వెనకడుగు వేసేది లేదని ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుందన్నారు. పోలీసులకు వీక్లీ ఆప్‌లు ఇవ్వాలనేది తన కోరికని, సిబ్బంది కొరతతో దాన్ని పూర్తిగా అమలు చేయడం లేదన్నారు. పోలీస్ సిబ్బంది సమస్యలు అన్నింటిని తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు.