వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
CM Jagan launch YSR Tallibidda Express vehicles.గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం
By తోట వంశీ కుమార్ Published on 1 April 2022 11:11 AM ISTగర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం 'డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి జగన్ విజయవాడలోని బెంచ్ సర్కిల్ వేదికగా 500 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చేందుకు, ప్రసవం అనంతరం తిరిగి వారిని ఇళ్లకు తీసుకెళ్లేందుకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా విశ్రాంతి సమయంలో తల్లి అవసరాల కోసం రూ. 5 వేలను సాయంగా అందించనున్నారు.
వాహనాలను ప్రారంభించిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. నేడు మరో మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకే ఈ వాహనాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి సగటున నాలుగు లక్షల దాకా ప్రసవాలు జరుగుతుంటాయి. ఆయా ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల సంఖ్య ఆధారంగా డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను కేటాయించనున్నారు. తల్లీబిడ్డను ఇంటికి తరలించేటప్పుడు ఆస్పత్రుల్లోని నర్సులు, వాహనాల డ్రైవర్ల సమన్వయం కోసం ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆస్పత్రుల్లో జరిగే ప్రతి ప్రసవానికి సంబంధించిన వివరాలు మాతృ, శిశు సంరక్షణ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆ వివరాలను యాప్‌కు అనుసంధానించి బాలింతలను క్షేమంగా ఇంటికి తరలించేందుకు చర్యలు తీసుకుంటారు. బాలింతను వాహనంలో ఎక్కించుకున్నప్పుడు, ఆమెను ఇంటి దగ్గర దించాక ఈ యాప్‌లో డ్రైవర్ ఫొటో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉంది.