ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి ప్రాంతంలో ఉన్న హైకోర్టుకు అదనంగా మరో భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. సోమవారం ఉదయం 9.50 నిమిషాలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా చేతుల మీదుగా శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సీఆర్‌డీఏ అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు, బార్ అసోయేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రస్తుత హైకోర్టు భవనంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాల నిర్వహణకు చోటు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఎదురుగా ఉన్న స్థలంలో మరో భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ అదనపు భవనాన్ని గ్రౌండ్+5 అంతస్థులుగా నిర్మించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.