వైసీపీకి చంద్రబాబు సవాల్.. ప్రత్యేక హోదాపై రాజీనామాకు మేం సిద్దం.. మీరు సిద్దమా..?
ChandraBabu says YCP MP's should resign over special status.ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి వేడెక్కింది. వైసీపీ
By తోట వంశీ కుమార్ Published on 11 Dec 2021 2:21 PM ISTఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి వేడెక్కింది. వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ధ్వజమెత్తారు. వైసీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాడకుండా వైసీపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. హోదాపై ఏ మాత్రం వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నా.. వెంటనే ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని.. తమ పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారన్నారు. శనివారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియాలో సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
ప్రత్యేకహోదా ముగిసిన అంశం అని ఇటీవల పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని.. ప్రత్యేక హోదాపై కేంద్రం మెడలు వంచుతామని నాడు జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు ఇప్పుడు ఎందుకు పోరాడటం లేదన్నారు. ప్రత్యేక హోదాపై ఇంకెన్నాళ్లు ప్రజల్ని మభ్యపెడతారన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎన్నికల్లో వాగ్ధానం ఇచ్చిన జగన్.. నేడు మడమతిప్పారన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. తమ హయాంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను గట్టిగా పోరాడి అడ్డుకున్నామని చెప్పారు.
కేంద్రంతో వైసీపీ ప్రభుత్వం లాలూచి పడిందని.. దొంగతనంగా వారికి రాష్ట్రాన్ని అప్పగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలపై అభిమానం లేదని.. డబ్బులు దోచుకొని దాచుకోవడం తప్పా.. రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. అందరం కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడదామన్నారు. ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని.. తమ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని.. ఈ సవాలుకు సిద్దమా..? అని చంద్రబాబు ప్రశ్నించారు.