రాష్ట్రంలో పెట్రో ధరలను తగ్గించే వరకు పోరాటం : చంద్రబాబు
Chandrababu Comments on fuel price in AP.పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు
By తోట వంశీ కుమార్ Published on 6 Nov 2021 2:48 PM ISTపెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాలు కూడా రాష్ట్ర పరిధిలోని వ్యాట్‌ను తగ్గించాలని కేంద్రం సూచించగా.. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా పెట్రో ధరలు తగ్గించాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. అనేక రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గించాయని.. అయితే ఏపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేసిన జగన్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ ధర కనీసం రూ.16 తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 9న ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పెట్రో ధరలు తగ్గించే వరకు తమ పోరాటం కొనసాగుతోందన్నారు. పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపైన పడుతుందన్నారు. ధరలు పెరగడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఓ పక్క విధ్వంసం.. మరో పక్క ప్రజలపై భారం.. ఇదే జగన్ పాలన అని ఎద్దేవా చేశారు. జగన్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.