క్యాసినోపై త్వ‌ర‌లో బైడెన్‌కు ఫిర్యాదు చేస్తారేమో ? : కొడాలి నాని

AP Minister Kodali Nani fires on TDP.కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jan 2022 2:39 PM IST
క్యాసినోపై త్వ‌ర‌లో బైడెన్‌కు ఫిర్యాదు చేస్తారేమో ? : కొడాలి నాని

కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రి కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు. విజ‌య‌వాడ‌కు ఎన్టీఆర్ జిల్లాగా నామ‌క‌ర‌ణం చేయ‌డాన్ని హ‌ర్షిస్తూ కృష్ణా జిల్లా గుడివాడ‌లో ఎన్టీఆర్ విగ్ర‌హానికి ఆయ‌న క్షీరాభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టారు. ఇది హర్షించదగిన విషయమ‌న్నారు. ఎన్టీఆర్‌ అభిమానుల తరపున సీఎం జగన్‌కు పాదాభివందనం చేస్తున్నామని తెలిపారు. ఇక రాజ‌కీయాల‌కు అతీతంగా ఎన్టీఆర్ పేరు పెడితే అభినందించాల్సి పోయి ఇంగిత జ్ఞానం లేకుండా తెలుగుదేశం పార్టీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

గుడివాడ క్యాసినో వ్యవహారంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. 'గుడివాడలో క్యాసినో నిర్వహించామని టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి అల్లరి చేశారు. మూడు రోజులు గుడివాడలో నిర్వహించిన క్యాసినోకు ఐదు వందల కోట్లు వస్తే.. 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలి అని ప్ర‌శ్నించారు. గుడివాడలో త‌న‌ను ఒడించలేకే లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని మండిప‌డ్డారు. గుడివాడ ప్రజలు అమాయకులు కాదని.. వారికి అన్ని విషయాలు తెలుసన్నారు. గుడివాడ‌లో 3 రోజుల క్యాసినోకు 362 రోజులు ప్ర‌చారం చేస్తున్నారన్నారు. టీడీపీ నేత‌ల‌కు జీవిత కాలం స‌మ‌యం ఇస్తున్నా. వాళ్ల ఇష్టమ‌ని చెప్పుకొచ్చారు. టీడీపీ వాళ్లు ఈ వ్య‌వ‌హారంపై త్వ‌ర‌లో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ క‌లిసి ఫిర్యాదు చేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు.

Next Story