ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సినిమా టికెట్ల ధరల నిర్ణయాన్ని జాయింట్ కలెక్టర్ తీసుకుంటారని తెలిపింది. ఈ మేరకు ధరల ప్రతిపాదనలను థియేటర్ల యాజమాన్యాలు జాయింట్ కలెక్టర్ ముందుంచాలని సూచించింది. టికెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
ఏం జరిగిందంటే..?
ప్రజల ప్రయోనాల కోసం సినిమా టికెట్ల ధరలు అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఆంధ్రప్రభుత్వం జీవో 35ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ జీవోతో సినిమా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు రాష్ట్ర హైకోర్టు ఆశ్రయించారు. హైకోర్టు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు ఉందని తెలుపుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 35ను సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసింది. అయితే.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో అప్పీల్‌కు చేసింది. దీనిపై నేడు వాదనలు విన్న హైకోర్టు థియేటర్ యాజమాన్యాలు టికెట్ ధరల ప్రతిపాదనలు జేసీ ముందు ఉంచాలని ఆదేశించింది.