రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా పాలన : గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
AP Governor Biswabhusan Harichandan speech in republic day celebrations.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 73వ గణతంత్ర
By తోట వంశీ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన జరిగింది. మొత్తం 16 శాఖలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం 'నవరత్నాలు' అమలు చేస్తోందన్నారు. ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేస్తున్నామన్నారు.
ఇక విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మనబడి నాడు-నేడు కింద కొత్తగా స్కూళ్లు, కాలేజీలు అభివృద్ధి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారని, పేద విద్యార్థులకు బాసటగా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. జగనన్న విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద పథకాల ద్వారా విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతోందని గవర్నర్ పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిచామని వివరించారు. రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. మత్స్యకారుల కోసం పిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్‌లు ఏర్పాటు చేశామని, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. ఇక ఆరోగ్య పరిరక్షణ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా ఇప్పటి వరకు 3.2 కోట్ల నిర్దారణ పరీక్షలు చేశామని, జనవరి 21 నాటికి 100 శాతం మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తి అయినట్లు తెలిపారు. 15 నుంచి18 ఏళ్ల వయసు ఉన్న వారికి 93 శాతం మేర వ్యాక్సిన్ పూర్తి చేశామన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది అని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు.