ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసనలు.. గవర్నర్ గో బ్యాక్..గో బ్యాక్ అంటూ
Andhra Pradesh Assembly Budget session start TDP members protest.ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
By తోట వంశీ కుమార్ Published on 7 March 2022 11:51 AM ISTఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు తొలిసారి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అసెంబ్లీకి రాగా.. ముఖ్యమంత్రి జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం లు స్వాగతం పలికారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా బడ్జెట్ సమావేశాలప్పుడు గవర్నర్ వర్చువల్ విధానంలోనే మాట్లాడిన సంగతి తెలిసిందే.
జాతీయ గీతంతో సమావేశాలు ప్రారంభం కాగా.. అనంతరం గవర్నర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసనలకు దిగారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్..గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బడ్జెట్ ప్రతులను చింపివేశారు. దీనిపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.
వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని గవర్నర్ అన్నారు. రైతులు, మహిళలు, బడుగు, బలహీనవర్గాలకు ప్రభుత్వం చేయూతనిచ్చిందని తెలిపారు. ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచినట్లు వెల్లడించారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన మొదలవుతుందన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మెరుగైన అభివృద్ది జరిగిందని.. గ్రామ, వార్డు సచివాలయాలు పారదర్శకంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకం కింద 44.5 లక్షల మంది తల్లులకు రూ. 13,023 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
గవర్నర్ ప్రసంగం మధ్యలోనే టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ తిరిగి వెళ్లే దారిలో టీడీపీ సభ్యులు వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. అనంతరం అసెంబ్లీ లాబీలో వారు బైఠాయించారు.
గవర్నర్ ప్రసంగం అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ షెడ్యూల్‌ను ఖరారు చేస్తారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. కాగా.. సమావేశాలను ఈనెల 26 వరకు నిర్వహించే అవకాశం ఉంది.