ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్నా.. రాజధాని విషయంలో ఇంకా గందరగోళం నెలకొంది. కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధానిపై బుధవారం రాజ్యసభలో ఆసక్తికర చర్చ జరిగింది. ఏపీ రాజధానిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించగా.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పందిస్తూ.. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏపీ రాజధాని అమరావతి అని అన్నారు. అయితే.. రాజధాని నిర్ణయం రాష్ట్రానిదేనని నిత్యానంద రాయ్ స్పష్టం చేస్తూ.. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పారు.
రాష్ట్ర విభజన తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ చర్యతో కలత చెందిన అమరావతి రైతులు అప్పటి నుంచి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, గత నవంబర్‌లో సాంకేతిక లోపాలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడు రాజధాని బిల్లులను ఉపసంహరించుకుంది. దీంతో రాజధాని విషయంలో గందరగోళం నెలకొందని.. ఏపీ రాజధానిపై స్పష్టత ఇవ్వాలంటూ జీవీఎల్ ప్రశ్నించగా.. నిత్యానంద రాయ్ పైవిధంగా స్పందించారు.