దుబ్బాక ఉపఎన్నిక తర్వాత హరీష్ రావుకు కేసీఆర్ బంపర్ గిఫ్ట్ : విజయశాంతి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Nov 2020 9:39 AM ISTదుబ్బాక ఉప ఉపఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలని కంటి మీద కునుకు లేకుండా.. చెమటోడ్చి పనిచేస్తున్న తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు గారికి ఆయన మామ, సీఎం కేసీఆర్ గారు ఊహించని షాక్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అన్నారు.
దుబ్బాక ఉపఎన్నిక తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలను నిర్వహించి, ఆ ఫలితాలు వచ్చిన వెంటనే, తన తనయుడు కేటీఆర్‌ను సీఎం పదవిలో కూర్చోబెట్టేందుకు కెసిఆర్ గారు రంగం సిద్ధం చేసినట్టు టిఆర్ఎస్ వర్గాలు ప్రచారం మొదలు పెట్టాయని ఆమె అన్నారు. ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా.. మొదటిసారి కెసిఆర్ గారి నోట సీఎం పదవికి రాజీనామా మాట బయటకు వచ్చింది. బీజేపీ మీద నెపం పెట్టి... తాను సిఎం పదవికి రాజీనామా చేస్తానని కెసిఆర్ గారు సంకేతాలివ్వడం భవిష్యత్ రాజకీయానికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారని ఆమె రాసుకొచ్చారు.
ప్రస్తుత హోంమంత్రి, బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు గతంలో తెలంగాణ పర్యటనలో ఉన్నప్పుడు కేంద్ర నిధులను కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. దీనిపై అప్పట్లో స్పందించిన కెసిఆర్ గారు, నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలను చూపించకపోతే అమిత్ షా గారిని తెలంగాణ భూభాగం నుంచి కదలనివ్వనని వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. తర్వాత ఆ వార్నింగ్ ఏమైందో ఎవరికీ అంతుచిక్కలేదు. అంతేకాదు తనపైనా.. తన ప్రభుత్వం పైనా నిరాధార ఆరోపణలు చేస్తే, ప్రతిపక్ష నేతలను జైలుకు పంపిస్తానని కెసిఆర్ గారు బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తన ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ప్రతిపక్షాలపై విరుచుకుపడే కేసీఆర్ గారు, ఇప్పుడు సీఎం పదవికి రాజీనామా చేస్తానని కొత్త అంశాన్ని ఎందుకు తెరమీదకు తెచ్చారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఓవైపు హరీష్ రావు గారు దుబ్బాకలో ప్రచారం చేస్తూ బీజేపీ నేతల మీద విరుచుకు పడుతున్న తరుణంలో.. ఆయన ప్రచారాన్ని డామినేట్ చేసే విధంగా కెసిఆర్ గారు బిజెపి నేతలకు సవాల్ విసరడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ ప్రకటన బిజెపి నేతలకే కాదు.. పరోక్షంగా హరీష్ రావు గారికి కూడా సంకేతం ఇచ్చినట్టే అని తెలంగాణ సమాజం భావిస్తోంది. మొత్తం మీద కెసిఆర్ గారి రాజీనామా ప్రకటన చూస్తుంటే.. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన తర్వాత (ఒకవేళ గెలిస్తే) హరీష్ రావు గారికి ఆయన మామ కేసీఆర్ గారు బంపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని.. ఆ గిఫ్ట్ ఏమిటంటే.. తాను సీఎం పదవికి రాజీనామా చేసి, కేటీఆర్‌ను సిఎం గద్దెపై కూర్చోబెట్టబోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎంతైనా నమ్మినవారిని గొంతు కోయడంలో కెసిఆర్ గారు అనుసరించే స్టైలే వేరని విమర్శలు చేశారు.