రాములమ్మకు బుజ్జగింపులు..!

By సుభాష్  Published on  29 Oct 2020 12:21 PM IST
రాములమ్మకు బుజ్జగింపులు..!

తెలంగాణ రాములమ్మ ఎవరంటే అంద‌రు ట‌క్కున చెప్పే పేరు విజయశాంతి. కాంగ్రెస్ నుంచి మరో పార్టీలోకి వెళ్లేందుకు కూడా క్లాప్ కొట్టబోతున్నారన్న ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వెడెక్కిస్తోంది. రాములమ్మ కాంగ్రెస్‌ను వీడి కాషాయంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతికి నేతలు బుజ్జగించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఆమెను బీజేపీలోకి చేర్చుకోవడానికి ఆ పార్టీ ముఖ్యనేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారన్న వార్తల నేపథ్యంలో టీపీసీసీ అప్రమత్తమైంది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ్‌కుమార్‌ బుధవారం విజయశాంతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోనూ, పార్టీ చేపట్టే కార్యక్రమాల్లోనూ తాను పాలుపంచుకునేందుకు తనకంటూ ఓ పదవి లేకపోవడం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలు అయిపోయాక తన ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ పదవి ఉన్నా లేనట్లయిందని, తాను పార్టీలో ఏ హోదాతో కార్యక్రమాల్లో పాల్గొనాలని రాములమ్మ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రచారానికి ఉపయోగించుకుని మిగతా సమయంలో ఇంట్లో కూర్చోమంటారా..? అని అన్నట్లు తెలుస్తోంది. అయితే ఏ స్థాయి బాధ్యతలు తీసుకుంటారో సమయం తీసుకుని తనకు చెప్పాలంటూ కుసుమ్‌కుమార్‌ ఆమెకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రచారానికి, సమావేశాలకు రాకపోవడానికి కరోనా పరిస్థితులే కారణమని విజయశాంతి వివరణ ఇచ్చినట్లు సమాచారం.

కాగా, భేటీ అనంతరం కుసుమ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. విజయశాంతి కాంగ్రెస్‌లోనే ఉంటారని, పార్టీని వీడబోరని స్పష్టం చేశారు. విజయశాంతికి కాంగ్రెస్‌, సోనియా, రాహుల్‌ గాంధీలంటే ఎంతో గౌరవమని, ఇతర పార్టీ నేతలు ఆమెను మర్యాదపూర్వంగా కలిశారని చెప్పారు. కరోనా కారణంగా ప్రచారానికి దూరంగా ఉన్నారని, గతంలో తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మెదక్‌ లోక్‌సభ పరిధిలోనే జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి విజయశాంతి దూరంగా ఉండటం, దీనికి తోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆమెతో సమావేశమైన నేపథ్యంలో రాములమ్మ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నిజానికి విజయశాంతి గత కొన్ని రోజుల నుంచి సైలెంట్‌గా ఉంటున్నారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అధిష్టానం అప్పగించినా రాష్ట్ర నాయకత్వం సహకరించడం లేదనే కారణంగా ఆమె అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపత్యంలో ఆమె కాంగ్రెస్‌ కార్యకలాపాల్లో చురుకుగా పాలు పంచుకోవడం లేదు. పార్టీ సమావేశాలకు సైతం హాజరు కావడం లేదు. ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ తొలిసారి రాష్ట్రానికి వచ్చిన సమయంలో జరిగిన సమావేశాలకు రాములమ్మను ఆహ్వానించినా హాజరు కాలేదు. ఇక దుబ్బాక ఎన్నికల వ్యవహారంలో ఆమె పార్టీ కానీ, పార్టీని ఆమె పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులకు, విజయశాంతికి మధ్య రాజకీయ దూరం పెరిగింది.

Next Story