సంచలనంగా మారిన ఐఏఎస్ అధికారి ఆత్మహత్య
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Jun 2020 4:38 AM GMTఆయనో ఐఏఎస్ అధికారి. కొన్ని నెలల క్రితం కోటిన్నర లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కొద్ది రోజుల క్రితం ఆయన్ను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చారు. కట్ చేస్తే.. తాజాగా ఆయన సూసైడ్ చేసుకున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. కర్ణాటకకు చెందిన ఐఏఎస్ అధికారి విజయ్ శంకర్ ఆత్మహత్య హాట్ టాపిక్ గా మారింది. తన ఇంట్లో ఆయన ప్రాణాలు కోల్పోయి పడి ఉన్న వైనాన్ని గుర్తించారు. అత్యున్నత ర్యాంకున్న అధికారి ఇలా ఆత్మహత్య చేసుకోవటం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఆయన సూసైడ్ కు కారణం ఏమిటన్నది ఒక ప్రశ్న కాగా..అసలీ పరిస్థితి కారణం ఆయనపై లంచం తీసుకున్న కేసు నమోదు కావటమేనా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. భారీగా వడ్డీలు చెల్లిస్తామంటూ ఆశ చూపి కర్ణాటకలోరూ.4వేల కోట్లకు పైగా భారీ మొత్తాన్ని డిపాజిట్ల రూపంలో సేకరించింది ఐఏఎం జ్యూవెలర్స్ సంస్థ. అనంతరం బోర్డు తిప్పేసింది. సుమారు 50వేల మంది డిపాజిట్లర్లు ఈ సంస్థ పైనా.. సంస్థ యజమాని మన్సూర్ పైనా ఫిర్యాదు చేశారు. సుమారు ఏడాది క్రితం జరిగిన ఈ ఉదంతం అప్పట్లో పెను సంచలనంగా మారింది. వేలాది మందికి నష్టం వాటిల్లిన ఈ ఉదంతంతో పెద్ద ఎత్తున నష్టపోయారు.
ఇదిలా ఉంటే.. ఐఏఎంకు క్లీన్ చిట్ ఇస్తూ విజయ్ శంకర్ తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. అయితే.. ఆయన కోటిన్నర మొత్తాన్ని లంచంగా తీసుకుంటూ పట్టుబడ్డారు. దీంతో.. ఈ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. అనంతరం న్యాయస్థానానికి చేరుకుంది. తాజాగా విజయ్ శంకర్ తో పాటు మరో ఇద్దరిని విచారించేందుకు రెండు వారాల క్రితం కర్ణాటక సర్కారు సీబీఐకు అనుమతిని ఇచ్చింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన ఆత్మహత్య చేసుకోవటం పెను సంచలనంగా మారింది.