న్యాయవ్యవస్థతోనూ పోరాటం చేయాల్సి వస్తోంది.. విజయసాయిరెడ్డి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Sept 2020 4:29 PM IST
న్యాయవ్యవస్థతోనూ పోరాటం చేయాల్సి వస్తోంది.. విజయసాయిరెడ్డి

ఏపీలో న్యాయవ్యవస్థతోనూ పోరాటం చేయాల్సి వస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడారు. న్యాయ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత, పక్షపాతంతో ఉందని, ఈ ధోరణి వెంటనే మానుకోవాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రస్తుతం కరోనాతో, ఆర్థిక ఇబ్బందులతో పాటు న్యాయవ్యవస్థతోనూ పోరాటం చేయాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. హైకోర్టు అసాధారణ చర్యలకు దిగుతోందన్నారు. మాజీ అడ్వకేట్ జనరల్‌పై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను రిపోర్టు చేయవద్దంటూ మీడియాపైనా, సోషల్ మీడియాపైనా ఆంక్షలు విధించిందని గుర్తు చేశారు. ఈ తరహా చర్యలను సమర్ధించుకునేందుకు వారికి ఏ ఆధారమూ లేదన్నారు.

బ్రిటిష్‌ వారి తరహాలో వ్యవహరిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మీడియా కవరేజ్, పబ్లిక్ స్క్రూటీని లేకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు ఉత్తర్వులు న్యాయపరంగా అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు గొంతునొక్కుడు చర్యలకు దిగుతుంటాయని.. ఏపీలో మాత్రం న్యాయవ్యవస్థే ఆ పనికి దిగిందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇబ్బందులకు గురవుతోందని దీన్ని అడ్డుకోవాలని విజయసాయిరెడ్డి రాజ్యసభలో కోరారు. న్యాయవ్యవస్థ నుంచి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా కరోనాను ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముందుందని చెప్పుకొచ్చారు.

Next Story