ఎమ్మెల్యే రాపాక వీడియో వైరల్.. బుద్దిచెప్పాలంటూ జనసైనికుల ట్వీట్..
By Newsmeter.Network
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీల నేతలు తమతమ పార్టీల తరపున బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించుకొనే పనిలో నిమగ్నమయ్యారు. గెలిచేవారికి బీఫామ్‌లు ఇప్పించుకోవటం, వారి తరపున ప్రచారం చేయటం వంటి కార్యక్రమాలతో ఏపీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. ఇదే సమయంలో జనసేన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌రావు తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌రావు రాజోలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. తొలిరోజుల్లో పవన్ కళ్యాణ్ వెంట నడిచిన ఆయన.. ఆ తరువాత జరిగిన పరిణామాలతో జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అలా ఉండక వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపిస్తూ వైసీపీ నేతలు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటూ పవన్ కళ్యాణ్‌కు కొరకరాని కొయ్యగా మారాడు.
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన వ్యవహారశైలి జనసేన కార్యకర్తలను మరింత ఆగ్రహానికి గురిచేస్తుందని తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆయన మరోసారి హాట్‌టాపిక్‌గా మారాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు బీఫాంలు ఇవ్వాల్సిన ఆయన వైసీపీ అభ్యర్థులకు బీఫామ్‌లు ఇచ్చే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో అమలాపురం వైసీపీ ఎంపీ చింతా అనూరాధ, రాజోలు వైసీపీ ఇన్‌చార్జి పెదపాటి అమ్మాజీతో మరో వైసీపీ నేత రాజేశ్వరరావుతో కలిసి ఓ హోటల్‌లో ఆ పార్టీ అభ్యర్థులకు బీఫాంలు ఇచ్చే పనిలో రాపాక నిమగ్నమయ్యారట.
దీనిని జనసేన కార్యకర్తలు కొందరు వీడియో తీసి నిజమైన రాజోలు వైసీపీ కార్యకర్తల్లారా ఆలోచించండి.. ఇంకా వీళ్లకి మద్దతు ఇస్తారా? మీకు మీ ప్రాంతం మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. ఓటుతో బుద్ది చెప్పండి సోదరుల్లారా అంటూ విజ్ఞప్తులు చేస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మరింది. దీంతో ఈ వ్యవహారం నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది.