Fact Check : బుర్ఖా వేసుకుని నడుచుకుంటూ వెళుతున్న మహిళ మీద దాడిచేసిన ఈ వీడియో ఫ్రాన్స్ లో చోటు చేసుకుందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2020 5:13 AM GMTఫ్రాన్స్ లో ముస్లింల మీద దాడులు జరుగుతూ ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో వివిధ పోస్టులు వెలుస్తూ ఉన్నాయి. ముస్లింలను టార్గెట్ చేసి వారిపై దాడులు చేస్తున్నారంటూ తప్పుడు సమాచారం కూడా ఇటీవలి కాలంలో ఎక్కువ అయింది.
ఇలాంటి సమయంలో ఓ ముస్లిం మహిళ పిల్లలతో కలిసి నడుచుకుంటూ వెళుతూ ఉంటే దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పిల్లల ముందే ఆ మహిళను కింద పడేసి కాలితో తంతున్న వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ వీడియోను పలువురు షేర్ చేస్తూ ఉన్నారు.
ఫేస్ బుక్ లో కూడా ఇదే వీడియోను పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
ఫ్రాన్స్ లో చోటు చేసుకుంది అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఘటన రష్యా దేశంలో చోటు చేసుకుంది. రష్యా , రిపబ్లిక్ ఆఫ్ తతర్స్తాన్ లోని నిజ్హేంకామస్క్ లో చోటుచేసుకుంది. జులై 2020న ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా RuNews24 అనే యూట్యూబ్ ఛానల్ లో 8 జులై 2020న వీడియోను పోస్టు చేశారు. “A maniac who attacked women was detained in Tatarstan.” అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.
ఆ వీడియో డిస్క్రిప్షన్ లో 'పార్క్ లో మహిళ మీద ఓ వ్యక్తి దాడి చేసాడని తెలుస్తోంది. అతడు చేసిన దాడి సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డు అయింది. గతంలో కూడా అతడు మహిళల మీద దాడి చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. మహిళలంటే అతడికి నచ్చకపోవడంతో ఈ దాడులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు.' అని ఉంది.
Komsomolskaya Pravda అనే రష్యన్ న్యూస్ పేపర్ లో కూడా ఈ ఘటనకు సంబంధించిన కథనాలను చూడొచ్చు. గుర్తు తెలియని వ్యక్తి తమ మీద దాడి చేశాడని పలువురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'ఫ్యామిలీ' అనే పార్కులో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. Tatarstan24, TV Channel 360 అనే మీడియా సంస్థల్లో కూడా ఈ ఘటనకు సంబంధించి ఇదే సమాచారాన్ని తెలియజేసారు.
బుర్ఖాతో నడుచుకుంటూ వెళుతున్న మహిళ మీద ఫ్రాన్స్ లో జరిగింది అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. మహిళలంటే గిట్టని ఓ వ్యక్తి ఇలా చాలా మంది మీద దాడి చేశాడు.