Fact Check : బీజేపీ నేత డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ జడ్జిలను బెదిరించారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Sept 2020 8:20 PM ISTడ్యాన్స్ ఇండియా డ్యాన్స్ రియాలిటీ షోకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 2015 సంవత్సరానికి చెందిన ఈ వీడియో క్లిప్ లో ఓ నేత మొత్తం సెట్ ను తన మాటలతో గడగడలాడించాడు. జడ్జీలను కూడా ఈ షో ఆపివేస్తాను అంటూ బెదిరించాడు. రియాలిటీ షో యూనిట్ వచ్చి అడ్డుకున్నా కూడా వినలేదు.
ఈ వీడియోను పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. 'ఓ బీజేపీ నేత కుమారుడు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ ఆడిషన్స్ లో పాల్గొన్నాడు. ఆ నేత తన కొడుకు గూండాలతో కలిసి అక్కడ భీతావహ వాతావరణాన్ని సృష్టించాడు. రియల్ భారతదేశానికి స్వాగతం, జయహో' అంటూ వీడియోను పోస్టు చేశారు. 31000కు పైగా ఈ వీడియోకు వ్యూస్ వచ్చాయి.
పలువురు అదే తరహాలో వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
నిజ నిర్ధారణ:
బీజేపీ నేత డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లో వివాదం సృష్టించాడు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
2015 లో టెలీకాస్ట్ అయిన ఈ ఎపిసోడ్ ఓ ప్రాంక్ వీడియో. జడ్జీలు ఒకరినొకరు ఆటపట్టించడానికి ఇది స్కిట్ లాగా చేసి చూపించారు.
జూన్ 27, 2015 న డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ సీజన్ 5 కు చెందిన ఎపిసోడ్ ఆడిషన్స్ ఢిల్లీలో చోటు చేసుకుంది. ఓ కంటెస్టెంట్ ను జడ్జిలు సెలెక్ట్ చేయరు. దీంతో అతడు అక్కడి నుండి వెళ్ళిపోడానికి ఒప్పుకోడు. తన తండ్రి పెద్ద లీడర్ అని చెప్పడమే కాకుండా జడ్జిలకు లంచం ఇవ్వడానికి రెడీ అని చెబుతాడు. అందుకు ఒప్పుకోని జడ్జీలు కంటెస్టెంట్ ను వెళ్లిపొమ్మని చెబుతాడు. ఇంతలో ఓ వ్యక్తి సెట్ లో ప్రత్యక్షమై జడ్జిలను బెదిరించడం మొదలుపెడతాడు. నా కొడుకు సెలెక్ట్ చేయలేదంటే ఈ షో మొత్తాన్ని రద్దు చేస్తానని చెబుతాడు. అలా గొడవ పెద్దదవుతూ ఉండగా.. సెక్యూరిటీకి చెప్పి వారిని పంపించేయమని చెబుతాడు జడ్జి పునీత్ పాఠక్. అలా గొడవ సాగుతూ ఉండగా ఆ ఎపిసోడ్ 46.16 నిమిషాల వద్ద మ్యూజిక్ ప్లే అవుతుంది. అప్పుడు ఇది నిజమైన గొడవ కాదు పునీత్ పాఠక్ మీద చేసిన ప్రాంక్ అని అర్థమవుతుంది. వెంటనే సెట్ లో నవ్వులు చిగురిస్తాయి.
జీ5 యాప్ లో మొత్తం ఎపిసోడ్ ను చూడొచ్చు.
అంతేకానీ ఈ వీడియోలో చోటు చేసుకున్న ఘటనకు భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్ధం'.