నేటి అర్థరాత్రి నుంచి ఓఆర్ఆర్ పై వాహనాలకు అనుమతి
By తోట వంశీ కుమార్ Published on 20 May 2020 12:24 PM GMT
ఓఆర్ఆర్ ( ఔటర్ రింగ్ రోడ్డు) రోడ్డు పై ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్. లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా మూతపడ్డ ఔటర్ రింగ్ రోడ్డు తెరుచుకోనుంది. ఈ రోజు అర్థరాత్రి నుంచి ఓఆర్ఆర్‌పై అన్ని వాహానాలకు అనుమతిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) అధికారులు తెలిపారు. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా మంగళవారం అర్థరాత్రి నుంచి వాహానాలను అనుమతించాలని హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్‌జీసీఎల్) నిర్ణంచాయి.
ప్రజా ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్ఆర్‌పై టోల్గేట్ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని నిర్దేశించింది. ఓఆర్ఆర్ టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ టాగ్ నిబందనలు పాటించాల్సి ఉంటుంది. డిజిటల్ పేమెంట్ పద్ధతిలో ఫాస్ట్ టాగ్ చెల్లింపులకు అవకాశం ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాయి. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్ఎండీఏ సూచించింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటున్న నేపథ్యంలో ఆ సమయంలో ఓఆర్ఆర్‌పై కార్లను అనుమతించడం జరగదు. ఓఆర్ఆర్‌పై ప్రయాణించే సరకు రవాణా వాహనాల(గూడ్స్ వెహికిల్స్)లో ప్రయాణీకులున్నట్లుగా టోల్ ప్లాజా సిబ్బంది గుర్తిస్తే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందజేయాలని హెచ్ఎండీఏ అధికారులు ఆదేశించారు.