నాకు కరోనా లేదు.. నా వద్ద కూరగాయలు కొనుక్కోవచ్చు.. వ్యాపారి వినూత్న ప్రచారం
By తోట వంశీ కుమార్ Published on 26 Aug 2020 1:42 PM ISTకరోనా మహమ్మారి కారణంగా ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారి ఎవరికి సోకిందో.. ఎవరికి సోకలేదో తెలియక అయోమయం చెందుతున్నారు. ఇక కూరగాయలు వంటి వాటిని కొనుగోలు చేయాలంటే భయపడిపోతున్నారు. దీంతో కూరగాయల వ్యాపారులపై దీని ప్రభావం పడింది. దీంతో ఓ కూరగాయల వ్యాపారి విన్నూతంగా ఆలోచించాడు. కరోనా పరీక్ష చేయించుకున్న సర్టిఫికేట్‌ను ఫ్రేమ్ కట్టించి మరీ తన కూరగాయల దుకాణంలో అందరికి కనిపించేలా పెట్టాడు. తనకు కరోనా లేదని అందరూ కూరగాయలు తన వద్ద కొనుగోలు చేయొచ్చునని వినియోగదారులకు భరోసా ఇస్తున్నాడు.
ఆదిలాబాద్ జిల్లా పాత ఉట్నూరుకు చెందిన కూరగాయల దుకాణదారు డోలి శంకర్ మంగళవారం స్థానిక పీహెచ్‌సీలో కొవిడ్-19 నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. తనకు కరోనా నెగిటివ్ రావడంతో.. ఆ ధ్రువపత్రాన్ని తన కూరగాయల దుకాణంలో అందరికీ కనిపించేలా ఫ్రేమ్ కట్టి పెట్టాడు. నాకు కరోనా లేదు.. నిర్భయంగా కూరగాయలు కొనవచ్చు అని వినియోగదారులకు భరోసా కల్పిస్తాడు.
ఇక తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో తెలంగాణలో 3018 కొత్త కేసులు నమోదు కాగా.. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,688కి చేరింది. ఇందులో 85,223 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 25,685 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 780 మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రాద్రి కొత్తగూడెంలో 95, జీహెచ్ఎంసి పరిధిలో 475, జగిత్యాలలో 100, కామారెడ్డిలో 76, కరీంనగర్ లో 127, ఖమ్మంలో 161, మహబూబాబాద్ లో 60, మంచిర్యాలలో 103, మేడ్చల్ లో 204, నల్గొండలో 190, నిజామాబాద్ జిల్లాలో 136, పెద్దపల్లిలో 85, రాజన్న సిరిసిల్లలో 69, రంగారెడ్డిలో 247, సిద్ధిపేటలో 88, సూర్యాపేటలో 67, వరంగల్ రూరల్ లో 61, వరంగల్ అర్బన్ లో 139 కేసులు నమోదయ్యాయి.