వర్మకు పెళ్లి కోరిక.. అతడిని పెళ్లి చేసుకోవాలని ఉందట
By తోట వంశీ కుమార్ Published on 23 April 2020 8:43 PM ISTనిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక సెటైర్ వేయంది నిద్రపోడు వర్మ, సామాజిక, రాజకీయ అంశాలపై తనదైన శైలిలో సెటైర్లు వేయడం వర్మకు అలవాటు. ఆయన చేసే ట్వీట్లు ఒక్కోసారి పెనుదుమారాన్ని రేపుతుండగా.. చాలా వరకు నవ్వుకునేలా ఉంటాయి.
ఇటీవల.. మందు బాబులు మద్యం దొరకక చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని, వారిని ఆదుకోవడం కోసం మమతా బెనర్జీలా పెద్ద మనసుతో ఇంటింటికి మద్యం చేస్తోందని.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ట్వీట్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు వర్మ. ఇక వర్మకి ఎవరు ఎప్పుడు నచ్చుతారో ఎవరికి తెలీదు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనపై పలు సరదా ట్వీట్‌లు చేసిన సంగతి తెలిసిందే. మరోసారి ట్రంప్‌పై ట్వీట్ పై చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు వర్మ.
తాజాగా వర్మ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య స్నేహం గురించి ట్వీట్ చేశాడు. వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియో పోస్టు చేసిన వర్మ.. ఆ వీడియోను ఎడిట్ చేసిన ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని అంటూ ట్వీట్ చేశాడు. రజినీకాంత్, మమ్ముట్టి కలిసి నటించిన దళపతి సినిమాలోని ‘సింగారాల పైరుల్లోన బంగారాలే పండెనంట’ పాట తమిళ వర్షన్‌ను జత చేర్చారు. ఈ పాటలో రజినీ, మమ్ముట్టి స్థానంలో మోదీ ట్రంప్‌లను చేర్చి వాళ్లు ఒకరికొకరు పోటి పడుతూ పాట పాడుతున్నట్లు ఎడిట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియోపై కామెంట్ల వర్షం కురుస్తోంది. సహజంగా ఎదుటి వాళ్లను హర్ట్ చేసేలా ట్వీట్స్ చేసే వర్మలో ఇలాంటి సరదా కోణం కోణం కూడా ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పాట తెలుగులో అయితే.. ఎలా ఉంటుందో కూడా ఎడిట్ చేసి ఆ వీడియోను కూడా కామెంట్‌లో పెట్టారు కొందరు.