మూడో పెళ్లికి సిద్దమైన టాలీవుడ్‌ హీరోయిన్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jun 2020 10:17 AM GMT
మూడో పెళ్లికి సిద్దమైన టాలీవుడ్‌ హీరోయిన్‌

సినీనటులు పెళ్లిళ్లు చేసుకోవడం, మళ్లీ విడాకులు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న ఓ హీరోయిన్‌ తాజాగా మూడో పెళ్లికి సిద్దమైంది అది కూడా 40 ఏళ్ల వయసులో. దేవీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది వనితా విజయకుమార్‌. ప్రముఖ సినీ నటుడు విజయకుమార్‌, మంజుల దంపతుల పెద్ద కూతురు. ఆమె సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవీ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందినప్పటికి ఆమెకు ఎందుకనో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక తమిళ్ లో సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వనితా గత ఏడాది తమిళ్ బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా మెరిసింది. వివాదాలతో అమ్మడు షోకు మంచి రేటింగ్ అయితే తెచ్చుకుంది గాని విమర్శల నుంచి తప్పించుకోలేక పోయింది.

1995లో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వనిత.. 2000లో సినీ నటుడు ఆకాష్‌ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కొన్ని కారణాల వల్ల 2005లో వారిద్దరు విడిపోయారు. అనంతరం 2007లో వ్యాపార వేత్త ఆనంద్‌ జయదర్షన్‌ను ఆమె రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరి దాంపత్యానికి చిహన్నంగా ఒక కూతురు కూడా పుట్టింది. అనంతరం వీరిద్దరు కూడా విడిపోయారు. అనంతరం ఆమె డ్యాన్స్‌ మాస్టర్‌ రాబర్ట్‌తో సహజీవనం చేస్తోంది.

తాజాగా ఆమె మూడో పెళ్లికి సిద్దమైంది. త్వరలో పీటర్ పాల్‌‌ను పెళ్లాడనుందామె. పీటర్ చెన్నైలో వీఎఫ్‌ఎక్స్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. జూన్ 27న గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం చెన్నైలోని తమ నివాసంలో వీరి పెళ్లి జరుగనుందని అధికారికంగా ప్రకటిస్తూ వెడ్డింగ్ కార్డ్ కూడా పోస్ట్ చేశారు. ఓ బిగ్‌ ప్రాజెక్ట్‌లో పనిచేస్తోన్న సమయంలో తాను పీటర్‌ను కలిశానని ఆమె వివరించింది. చేదు అనుభవాల అనంతరం కూడా ప్రేమను పొందే అవకాశాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయని వ్యాఖ్యానించింది.

Next Story