వైసీపీ కీలక నేతతో ఎమ్మెల్యే వంశీ భేటీ అయ్యారు. కృష్ణా జిల్లాకు సంబంధించి దుట్టా రామచంద్రరావు కీలక నేత. వైఎస్ఆర్ సీపీ పొలిటికల్ కమిటీ సభ్యుడు. ఇంతటీ కీలక నేతతో వంశీ భేటీ కావడం కృష్ణా జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దుట్టా రామచంద్రరావు ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వంశీ చాలా సేపు చర్చలు జరిపారు. టీడీపీకి వంశీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికలకు వెళ్తే ఏంటీ పరిస్థితి అనే దానిపై ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసిన వంశీ…త్వరలో వైఎస్ జగన్‌ సమక్షంలో వైఎస్ఆర్‌ సీపీలో చేరుతానని ప్రకటించారు. గన్నవరం వైఎస్‌ఆర్‌సీపీ ఇంటర్నల్ పాలిటిక్స్ ఎలా ఉన్నప్పటికీ…వంశీ మాత్రం తనదైన శైలిలో రాజకీయ మంత్రాంగం నడుపుతున్నారు. తనకు అత్యంత ఆప్తుడైన దుట్టా రామచంద్రరావుతో భేటీ అయ్యి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులకు స్పష్టమైన సంకేతాలు వంశీ పంపించారు.

vamshi-meet-dhutta-ramachandra-rao

మొత్తానికి టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలనుకున్న వైఎస్‌ఆర్‌ సీపీ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. అయితే..వైఎస్‌ఆర్‌సీపీకి అంతర్గతంగా ఈ విషయంలో తలనొప్పి ఉన్న మాట వాస్తవం. నిన్ననే మంత్రులు యార్లగడ్డ వెంకట్రావ్‌ను వెంటబెట్టుకుని సీఎం జగన్‌ను కలిశారు. ఈ భేటీ తరువాత వెంకట్రావ్‌ వాయిస్‌లో జస్ట్ ఛేంజ్ వచ్చినప్పటికీ రాజకీయంగా మాత్రం వంశీ, వెంకట్రావ్ మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటోంది. దీనికి వెంకట్రావ్ వ్యాఖ్యలే నిదర్శనం. వంశీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరంలేదంటూ వెంకట్రావ్ తనదైన శైలిలో మీడియా ముందు స్పందించారు. వైఎస్ జగనే స్వయంగా వివాదంలో కల్పించకున్నప్పటికీ వెంకట్రావ్ – వంశీ రాజకీయంగా ఇంకా విభేదిస్తున్నారు అని చెప్పడానికి ఈ మాటలే నిదర్శనం.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీని కనబడకుండా చేయాలనేది వైఎస్ఆర్ సీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే టీడీపీ బలంగా ఉన్న కృష్ణా జిల్లాను మొదట టార్గెట్ చేశారు. అందులోనూ గన్నవరంపై వైఎస్ఆర్ సీపీ నేతలు గురి పెట్టారు. టీడీపీలో యువ నాయకుడిగా, మాస్ ఫాలోయింగ్‌ ఉన్న వంశీని వైఎస్ఆర్‌ సీపీ అథిష్టానం టార్గెట్ చేసింది. వంశీని లాగితే టీడీపీని డిఫెన్స్‌లో పడేయొచ్చుఅనే వైఎస్ఆర్ సీపీ ఆలోచన ఫలితాన్ని ఇచ్చింది. ఈ లోపు దేవినేని అవినాష్ కూడా వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు ఇసుక దీక్ష రోజే అవినాష్ వైఎస్ఆర్‌ సీపీలో చేరడం, వంశీ మీడియా సాక్షిగా చంద్రబాబు, లోకేష్‌లపై ఫైర్ అవడం టీడీపీని డిఫెన్స్‌లో పడేశాయనే చెప్పాలి. గేట్లు తెరిస్తే రావడానికి చాలా మంది టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని..చోటు లేక తామే వద్దంటూన్నామని వైఎస్ఆర్ సీపీ నేతలు చెబుతున్నారు. తాము తలచుకుంటే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ప్రకటించారు.

వైఎస్ జగన్‌ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నప్పటీకి పార్టీ, పదవులకు రాజీనామా చేసి రావాలనే చెబుతున్నారు. దీనికి అంగీకరించే వంశీ వైఎస్ఆర్‌ సీపీ తీర్దం పుచ్చుకోబోతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.