ఆ రూ.150 కోట్ల భూమి కోసమే వంశీ పార్టీ మారుతున్నారా ?!!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Nov 2019 12:47 PM ISTగన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మార్పుపై రెండు,మూడు రోజుల్లో క్లారిటీ రాబోతుంది. ఆదివారం ఆయన పార్టీ మారుతారని అనుచరులు అంటున్నారు. 3న వైసీపీ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. అయితే..ఆయన వైసీపీలోకి వెళతారా? బీజేపీలో జాయిన్ అవుతారా? అనేది మాత్రం వారం రోజుల్లో తేలుతుంది అనేది బెజవాడ జనం మాట.
ఇటు వంశీని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. ఎంపీ కొడాలి నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను పంపించారు. గన్నవరం టీడీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్కడి నుంచి కొందరు కార్యకర్తలు వంశీ దగ్గరకు వెళ్లారు. కొందరు నేతలు మాత్రం టీడీపీని వీడేది లేదని చంద్రబాబుకు హామీ ఇచ్చారు.
వంశీ ఎందుకు పార్టీ మారుతున్నారు? అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. నకిలీ పట్టాల కేసుకు భయపడి పార్టీ మారుతున్నారని కొందరి వాదన. అయితే అది చాలా చిన్న కేసు. వంశీ ఇంతకుముందు ఎదుర్కొన్నా కేసుల కంటే చాలా చిన్నది. కానీ రాజకీయంగా వేరే అంశాలు ఉన్నాయననేది వంశీ రాజకీయాలు పరిశీలిస్తున్న నేతలు చెప్పే మాట.
హైదరాబాద్ శంకర్‌పల్లి ఏరియాలో వంశీకి 42 ఎకరాల భూమి ఉంది. ఇందులో కొంత వివాదంలో ఉంది. వంశీ మొన్న వేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఈ భూమి విలువ రూ. 76 కోట్లు. అనధికారికంగా ఇక్కడ మరి కొంత భూమి వంశీ,ఆయన బినామీలకు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారుగా రూ.150 కోట్ల విలువైన భూములు వారికి ఉన్నాయి. ఇప్పుడు ఈ భూముల విలువకు రెక్కలు వస్తున్నాయి. వీటిని కాపాడుకునేందుకు తెలంగాణ నేతల సాయం అవసరం. ఇప్పుడు తెలంగాణ సర్కార్‌తో ఏపీ సర్కార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఈభూమిని కాపాడుకునేందుకు వంశీ పార్టీ మారుతున్నారని ఓ ప్రచారం నడుస్తోంది.
గతంలో బెంగళూరులో కొడాలి నానికి కూడా ఇలాంటి భూమి సమస్య వచ్చి పడిందట. అప్పట్లో జగన్ ఆసమస్యను సాల్వ్ చేశారట. పెద్దపెద్ద నేతలే పరిష్కరించని సమస్యను జగన్ తీర్చడంతో ఆయన వెంట నడిచారట. ఆర్ధికంగా కోలుకున్నారట. ఇప్పడు వంశీకి కూడా అదే సమస్య వచ్చి పడిందట. టీడీపీలో ఎదిగే పరిస్థితి లేదు. ఐదేళ్ల అధికారంలో ఉంటే ఆర్థికంగా ఎదగలేదు. ఇటు చూస్తే వైసీపీ అధికారంలో ఉంది. జగన్ మరో 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటారు. తన స్నేహితుడు గుడివాడ నాని మంత్రి అయ్యాడు. దీంతో తనకు కూడా బెటర్ పొజిషన్‌లోకి వెళ్లాలంటే పార్టీ మారాలనే నిర్ణయానికి వంశీ వచ్చారని తెలుస్తోంది.
వంశీ అనుచరులు రెండు రోజుల్లో వైసీపీ లో వంశీ చేరుతాడని చెప్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా వంశీని తమవైపు లాక్కునే ప్రయత్నం చేస్తుందన్న ప్రచారం జరుగుతుంది. వంశీ వైసీపీ లో చేరితే జగన్ నిబంధన ప్రకారం ముందు MLA పదవికి రాజీనామా చెయ్యాలి. ఉప ఎన్నికలో వంశీకి వైసీపీ టిక్కెట్ ఇస్తుందా?ఇదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. అటు యార్లగడ్డ వెంకట్రావు ,కొడాలి నాని మనిషి. ఇటు వంశీ కూడా ఫ్రెండ్. దీంతో నాని ఏం చేస్తాడు? ఎవరికి టికెట్ ఇప్పిస్తారనేది కీలకమైన మరో ప్రశ్న.