వకీల్ సాబ్ మొదలెట్టేశాడా?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2020 8:03 AM IST
వకీల్ సాబ్ మొదలెట్టేశాడా?

తెలంగాణలో షూటింగ్‌లు పున:ప్రారంభించడానికి ప్రభుత్వం ఎప్పుడో అనుమతులు ఇచ్చేసింది. కానీ ప్రభుత్వం నిర్దేశించిన షరతుల ప్రకారం షూటింగ్ చేయడం అంత సులువు కాదనుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. దీనికి తోడు హైదరాబాద్‌లో కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరుగుతుండటంతో హీరోలు షూటింగ్స్ విషయంలో భయపడుతున్నారు. దీంతో అనుమతులున్నప్పటికీ పెద్దగా షూటింగులు జరగట్లేదు. చిన్నా చితకా సినిమాలు, సీరియళ్లు మినహాయిస్తే పేరున్న సినిమాల చిత్రీకరణలు మొదలు కానట్లే కనిపిస్తోంది. ఐతే టాలీవుడ్లో షూటింగ్ రీస్టార్ట్ చేసిన తొలి పెద్ద సినిమాగా ‘వకీల్ సాబ్’ గురించి చెబుతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పరిమిత సంఖ్యలో కాస్ట్ అండ్ క్రూ మధ్య హైదరాబాద్‌లో పున:ప్రారంభమైనట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ముందు అనుకున్న ప్రణాళికలను కొంచెం మార్చి ‘వకీల్ సాబ్’ టీం షూటింగ్ రీస్టార్ట్ చేసిందట. రూ.3 కోట్ల భారీ ఖర్చుతో కోర్టు సెట్ వేసి.. ఇన్‌డోర్ షూట్ చేస్తున్నారట. 50 మందికి మించకుండా సెట్లో ఉండేలా చూసుకుంటున్నారట. పవన్ చిత్రీకరణలో పాల్గొంటున్నది లేనిది తెలియట్లేదు కానీ.. కోర్ట్ సీన్ అంటే కచ్చితంగా ఆయన షూటింగ్‌కు హాజరవుతూనే ఉండాలి. ఈ సెట్లో షూట్ మొత్తం పూర్తి చేస్తే సినిమా కూడా పూర్తయినట్లే. లాక్ డౌన్ లేకుంటే మే 15నే రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. పవన్ ఇంకో వారం పది రోజులు పని చేస్తే ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. కోర్టు సీన్లు కొన్నే ఉన్నాయని.. తర్వాత హీరోయిన్ ట్రాక్, ఓ పాట తీయాల్సి ఉంటుందని అంటున్నారు. పరిస్థితులు బాగుంటే దసరా లేదా క్రిస్మస్‌కు ‘వకీల్ సాబ్’ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

Next Story