జగన్ బాటలోనే ఉత్తరాఖండ్..ముందుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదన
By రాణి Published on 6 March 2020 12:35 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని పలురాష్ట్రాల్లో ఈ ప్రతిపాదనపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే జగన్ ప్రతిపాదన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కు బాగా నచ్చేసింది. అందుకే ఆయన తన రాష్ట్రంలోనూ మూడు రాజధానులను నిర్మించబోతున్నారు.
అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తూ రాష్ట్రంలోని గైర్ సైన్ వేసవి రాజధానిగా ఉండబోతోందని, డెహ్రాడూన్ పరిపాలనాపరమైన రాజధానిగా ఉంటుందని, నైనీతాల్ జ్యుడీషియల్ రాజధానిగా ఉండబోతోందని ఆయన తెలిపారు. ఉత్తరాఖండ్ కొండప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రమని, కొండ ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతంలో రాజధాని ఉండాలని చాలా కాలంగా కోరుకుంటున్నారని, వారి కోరికను మన్నిస్తూ గైర్ సైన్ లో రాజధానిని ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ లు మొదటి నుంచి గైర్ సైన్ ను రాజధానిని చేస్తామని చెబుతూనే వచ్చాయి. కానీ త్రివేంద్ర సింగ్ హయంలో అది వాస్తవరూపం దాల్చబోతోంది. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి డెహ్రాడూన్ లో శాసనసభ, సెక్రటేరియట్ లు ఏర్పాటయ్యాయి. ఆ రాజధాని అలాగే కొనసాగుతుంది. ముఖ్యమంత్రి నివాసం, రాజభవన్ లు కూడా డెహ్రాడూన్ లోనే ఉన్నాయి.
https://telugu.newsmeter.in/ap-cabinet-meeting-today-2/
ఇప్పుడు కర్నాటక లోనూ బెంగుళూరు నుంచి కొన్ని ప్రధాన శాఖలను ఇతర నగరాలకు తరలించాలని భావిస్తున్నారు. పాలనా వికేంద్రీకరణతో పాటు, ప్రజా ఆకాంక్షలకు కూడా పట్టం కట్టడానికి ఇది చాలా అవసరమని ఎడియోరప్ప భావిస్తున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వైఎస్ జగన్ తెచ్చిన మూడు రాజదానుల ప్రతిపాదనను తెలుగుదేశం, బిజెపి, జనసేనలు వ్యతిరేకిస్తున్నాయి. తెలుగుదేశం ఇప్పటికే ఆందోళన బాట పట్టింది. బిజెపిలోనూ తెలుగుదేశం మూలాలున్న నాయకులు కొందరు మూడు రాజధానుల ప్రతిపాదనను విమర్శిస్తున్నారు. అయితే రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాత్రం రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్రప్రభుత్వం నిర్ణయమని, ఇందులో కేంద్రం జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు. ఇప్పుడు వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తున్న ఉత్తరాఖండ్, కర్నాటకలు రెండూ బిజెపి పాలిత ప్రాంతాలు కావడంతో బిజెపి ఇప్పుడు జగన్ ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.