లడాఖ్.... మీకు తెలియని పది ప్రత్యేకతలు ఇవే!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 2:37 PM GMT
లడాఖ్.... మీకు తెలియని పది ప్రత్యేకతలు ఇవే!!

లడాఖ్... ఈ ప్రాంతం గురించి తెలిసిన వారు చాలా తక్కువ. అసలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన తరువాతే చాలా మంది లడాఖ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం ప్రారంబించారు. అంతకు ముందు మోటర్ సైకిల్ రైడింగ్ సాహసికులు మాత్రమే సరదాగా, సాహసాలు చేయడానికి ఖార్ డుంగ్లా కనుమ దాకా వచ్చి, కాసిని ఫోటోలు దిగి వెళ్లిపోయేవారు. కానీ లడాఖ్ గురించి తెలుసుకోవాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి.

- మంచు ఎడారిః నిజానికి లడాఖ్ ఒక మంచు ఎడారి. వర్షపాతం తక్కువ. నీటి వనరులు ఉండవు. కిలో మీటర్ల పొడవున ప్రయాణించినా ఒక్క గడ్డిపరక కూడా కనిపించదు. నునుపైన కొండలు, వాటిపైన మంచు దుప్పటి తప్ప మరేమీ కనిపించదు. సరైన దారులు ఉండవు. రాకపోకలు అసాధ్యం.

- చ.కి.మీకి ముగ్గురేః లడాఖ్ జనసాంద్రత చాలా తక్కువ. అవిభక్త జమ్మూ కశ్మీర్ లో 60 శాతం భూభాగం లడాఖ్ కి చెందినదే. కానీ ఇక్కడ జనాభా మొత్తం రెండున్నర లక్షలు మాత్రమే. ఒక చదరపు కిలో మీటర్ కి కేవలం ముగ్గురు మనుషులు మాత్రమే ఉంటారు. గ్రామాల జనాభా అరవై, డెబ్భయి మందికి మించరు. భూభాగం ఎక్కువ, జనాభా తక్కువ ఇది లడాఖ్ ప్రత్యేకత. లడాఖ్ లో రెండు భాగాలుంటాయి. ఒకటి లేహ్. ఇక్కడ బౌద్ధులు ఎక్కువ. రెండవది కార్గిల్. కార్గిల్ లో షియా ముస్లింల జనాభా ఎక్కువ.

- అతి తక్కువ ఆక్సిజన్ : లడాఖ్ లోని పలు ప్రాంతాలు సముద్ర మట్టానికి పదిహేను వేల అడుగుల ఎత్తున ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాతావరణంలో ఆక్సిజన్ చాలా తక్కువ. దాంతో త్వరగా ఆలసిపోతాం. ఊపిరి అందదు. గాలి ప్రెషర్ చాలా తక్కువ. దీని వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. హై ఆల్టిట్యూడ్ అనారోగ్యాలు వస్తాయి. అందుకే లడాఖ్ కు వెళ్లిన తరువాత ఒకటి రెండు రోజులు అక్కడి వాతావరణం అలవాటు కావడానికి ఉండాల్సి ఉంటుంది. దీనిని ఎక్లమటైజేషన్ అంటారు.

- చుమార్ గ్రామం ప్రత్యేకత: ఇక్కడ ఉండే చుమార్ గ్రామంలో ఆకాశం నుంచి ప్రమాదకరమైన అల్ట్రా వయొలెట్, ఇన్ ఫ్రా రెడ్ కిరణాలు, కాస్మిక్ కిరణాలు ఎక్కువగా నేలను తాకుతాయి. ఇవి మన శరీరానికి తాకితే చర్మ వ్యాధులు వస్తాయి. చర్మం మాడిపోయినట్టుగా అయిపోతుంది. ఈ కిరణాలు శరీరంలో ఏ భాగాన్ని తాకితే ఆ భాగం దెబ్బతింటుంది. అయితే స్థానికులలో దీనిని తట్టుకునే ఒక ప్రత్యేక డీఎన్ ఏ ఉంటుంది. దీని వల్ల వారిలో ఈ లక్షణాలు కొద్దిగానే కనిపిస్తాయి.

- ఉప్పునీటి చెరువు పాంగాంగ్ః లడాఖ్ లో పాంగాంగ్ ట్సో అనే ఒక పెద్ద చెరువు ఉంది. భౌగోళిక శాస్త్రవేత్తల కథనం ప్రకారం భూఖండాల పలకలు ఒకదానిని ఒకటి ఢీకొన్న ప్రదేశం ఇదే. దీని వల్ల హిమాలయాలు ఎత్తెదుగుతున్నాయి. ఇక్కడ రెండు భూఖండాల తాకిడి వల్ల కొంత సముద్రజలం మిగిలిపోయింది. ఆ జలమే పాంగాంగ్ చెరువు అని శాస్త్రవేత్తలు చెబుతారు. ఈ చెరువు 160 కిలో మీటర్ల పొడవు. విచిత్రం ఏమిటంటే ఈ చెరువులో 50 కి.మీ మన దేశంలో ఉంది. మిగతాది చైనా కబ్జాలో ఉంది. చైనా పడవలు మన జలాల్లో ప్రవేశించేందుకు నిత్యం ప్రయత్నిస్తూ ఉంటాయి. మన సైనికులు వాటిని నిరోధించి వెనక్కి పంపించేస్తూ ఉంటారు. నీలి రంగు నీటితో నిశ్చలంగా ఉండే ఈ చెరువు నీరు చాలా ఉప్పగా ఉంటుంది. అందుకే ఈ నీటిలో జీవ జంతు జాలం బతికి బట్టకట్టలేదు. చేపలు కూడా ఉండవు. ఆమిర్ ఖాన్ నటించిన సుప్రసిద్ధ చిత్రం “త్రీ ఈడియట్స్” క్లైమాక్స్ ను ఈ చెరువు వద్దే చిత్రీకరించారు.

- దౌలత్ బేగ్ ఓల్డీః ప్రపంచంలోని అతి ఎత్తైన విమాన లాండింగ్ లడాఖ్ లోనే ఉంది. ఆ ప్రదేశం పేరు దౌలత్ బేగ్ ఓల్డీ. దౌలత్ బేగ్ ఓల్డీ అంటే దౌలత్ బేగ్ చనిపోయిన చోటు అని అర్థం. దౌలత్ బేగ్ అనే మహా ధనిక వ్యాపారి ఈ దారి గుండా చైనా నుంచి లడాఖ్ కి వస్తూండగా మంచు తుపానులో కూరుకుని చనిపోయాడు. ఆయన వెంటే ఆయన వద్ద ఉన్న వెకట్టలేనంత ఆస్తిపాస్తులు, ధనం, బంగారం కూడా మంచులో మాయమైపోయాయి. ఇది చైనా సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ చైనా దురాక్రమణను అడ్డుకునేందుకు ఒక ఎయిర్ ఫీల్డ్ ను భారత ప్రభుత్వం నిర్మించింది. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశం లో ఈ రన్ వే ఉంటుంది.

- ప్రెగ్నెన్సీ టూరిజంః లడాఖ్ లో ఆర్యన్ వ్యాలీ అనే చోటు ఉంది. ఇక్కడ నివసించే తెగలు ఆర్యులని చాలా మంది పాశ్చాత్యుల నమ్మకం. దీంతో చాలా యూరోపియన్ దేశాల నుంచి ఆర్య సంతతిని కోరుకునే మహిళలు ఇక్కడికి వస్తారు. ఇక్కడి స్థానికులతో కొంతకాలం నివసించి సంభోగించి, గర్భవతులౌతారు. అలా “ప్యూర్ ఆర్య సంతతి”కి జన్మనిస్తారు. దీంతో ఈ ప్రాంతంలో ఒక కొత్త తరహా టూరిజం పుట్టుకొచ్చింది. దాని పేరు “ప్రెగ్నెన్సీ టూరిజం.” బహుశ ప్రపంచంలో ఇలాంటి విచిత్రమైన టూరిజం ఇంకెక్కడా లేదేమో. బిడ్డల కోసమే యూరోపియన్లు ఇక్కడికి వస్తూంటారు.

- ఆక్సాయి చిన్ ః లడాఖ్ కి చెందిన ఆక్సాయిచిన్ ప్రాంతం చైనా కబ్జాలో ఉంది. ఇది మొత్తం 38,000 చకిమీ వైశాల్యం ఉన్న భూ ప్రదేశం. ఇక్కడ జనావాసాలు దాదాపుగా లేవు. వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంటుంది. అయినా ఈ భూభాగాన్ని చైనా 1950 ప్రాంతాల్లోనే కబ్జా చేసుకుని, ఒక సువిశాలమైన రోడ్డును నిర్మించింది. టిబెట్ రాజధాని లాసా నుంచి చైనాలోని షింజాంగ్ రాష్ట్రంలోని కాశ్ గర్ వరకూ రహదారిని నిర్మించింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయి, దానిని 1958 లో అట్టహాసంగా చైనా ప్రారంభించి, ప్రపంచానికి తెలియచెప్పే దాకా మన ప్రభుత్వానికి ఏమీ తెలియదు. అంత గాఢంగా నిద్రపోయింది అప్పటి మన ప్రభుత్వం.

- సియాచిన్ ః ప్రపంచంలోని అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ లడాఖ్ లోనే ఉంటుంది. సియాచిన్ ఒక పెద్ద మంచుకొండ. అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇది. ఇక్కడ మైనస్ 60 డిగ్రీల చలి ఉంటుంది. ఇక్కడ తూటాలకు బలై చనిపోయేవారి కన్నా చలికి బలై పోయే వారి సంఖ్యే ఎక్కువ. సియాచిన్ ను కబ్జా చేసుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. కానీ ప్రాణాలకు తెగించి మన సైనికులు ఈ బూభాగాన్ని కాపాడుతున్నారు. తమాషా ఎమిటేంటే సలసల మరిగే టీను ఫ్లాస్క్ నుంచి గాల్లోకి విసిరేస్తే అవి నేల మీద పడేటప్పటికి మంచుగడ్డలుగా మారిపోతాయి. ఇంతా తమాషా ఏమిటంటే సైనికులు చేసే మల మూత్ర విసర్జనను కూడా సియాచిన్ హిమానీ నదంపై చేయడానికి వీల్లేదు. పర్యావరణ పరంగా ఇందుకు అనుమతి లేదు. కాబట్టి వారి మలమూత్రాలను వేరుగా సేకరించి, విమానం ద్వారా చండీగఢ్ కు పంపి, అక్కడ వాటిని విసర్జిస్తారు. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో బహుశః ఇంకెక్కడా లేదు. ఇంతకీ సియాచిన్ అంటే ఏమిటో తెలుసా? బల్తీ భాషలో ఈ పదానికి అర్థం “నల్ల కలువ.”

- కార్గిల్ యుద్దం ఇక్కడేః 1998 లో జరిగిన కార్గిల్ యుద్దం పూర్తిగా లడాఖ్ భూభాగంలోనే జరిగింది. ద్రాస్, టోలోలింగ్, టైగర్ హిల్, ముష్కో లోయ వంటి యుద్ధం జరిగిన చోట్లన్నీ కార్గిల్ ప్రాంతంలోనే ఉన్నాయి. కార్గిల్ యుద్ధంలో లడాఖ్ స్థానికుడు సోనమ్ వాంగ్ చుక్ చేసిన వీరోచిత పోరాటానికి అతనికి మహావీర చక్ర ఇవ్వడం జరిగింది.

  • రాకా సుధాకర్, జమ్ముకశ్మీర్ స్టడీ సెంటర్ పరిశోధకులు

Next Story