తాటిముంజల వల్ల ఉపయోగాలెన్నో..మీకు తెలుసా ?

By రాణి  Published on  18 March 2020 6:26 AM GMT
తాటిముంజల వల్ల ఉపయోగాలెన్నో..మీకు తెలుసా ?

తాటి ముంజలు..ఈ తరం పిల్లలకు వీటి గురించి తెలుసో లేదో కానీ..మన పూర్వ తరం వాళ్లైతే మాత్రం వేసవి కాలం వచ్చిందంటే చాలు..తాటి ముంజలు తినే పనిలోనే ఉండేవాళ్లు. మీ చిన్నప్పుడు వేసవి సెలవులకు అమ్మమ్మ, నానమ్మల ఇళ్లకు వెళ్లినపుడు..తాతయ్యలు, బాబాయ్ లు ఎంతో ప్రేమతో ఇవి మీకు తెచ్చిపెడుతుండేవారు కదా. మరి ఇప్పుడు మీ పిల్లలకు మీరు కూడా ఇవి తినిపిస్తున్నారా ? నిజానికి తాటి ముంజలను ఇష్టపడని వారంటూ ఉండరు. సహజంగానే ఇవి తియ్యగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకు ఒక్కసారి రుచి చూపిస్తే..అస్సలు వదలరు. తాటిముంజలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలున్నాయి. అవేంటో మీకు తెలుసా ? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.

వేసవి కాలంలో ఎక్కువగా దొరికే పండ్లు మామిడి. కానీ ఇవి ఇప్పుడు పూర్తిగా రసాయనికం అవుతున్నాయి. వీటితో పాటు..ప్రకృతి లో ఉండే తాటి చెట్ల నుంచి ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా సహజ సిద్ధంగా లభించేవి తాటి ముంజలు. చూడటానికి జెల్లీగా..పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయివి. ఇలా నోట్లో వేసుకుంటే..అలా కరిగిపోతాయి ముంజలు. వీటి లోపల ఉండే నీరు మన శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది. లేత కొబ్బరి రుచిని మరిపించే ఈ తాటి ముంజలను ఇంగ్లీష్ లో ఐస్ యాపిల్, కన్నడలో తాటి నుంగు, తమిళంలో నుంగు అని కూడా పిలుస్తుంటారు. ఒకప్పుడు పల్లెటూర్లలోనే ఉండే ముంజలు ఇప్పుడు..పట్టణాల్లో కూడా లభిస్తున్నాయి. పండ్ల వ్యాపారులు ఏరోజుకారోజు తాటి ముంజలను కోసుకొచ్చి అమ్ముతున్నారు.

తాటి ముంజల వల్ల కలిగే ఉపయోగాలు

ముంజలలో ఉండే క్యాలరీలు తక్కువే అయినా..శరీరానికి ఎక్కువ శక్తినిస్తాయి. ఎండాకాలంలో చాలా మందికి చర్మపై చిన్న చిన్న పొక్కులు(పేలడం) వస్తాయి. తాటి ముంజలు తినడం వల్ల శరీరంలో వేడి తగ్గి..అలాంటి పొక్కులు రాకుండా ఉంటాయి.

అలాగే వేసవిలో చాలా మందికి ఇట్టే నీరసం వచ్చేస్తుంది. ఎంత నీరు తాగినా..ఎన్ని ఎనర్జీ డ్రింక్స్ తాగినా రాని ఉపశమనం..తాటి ముంజలు తినడం వల్ల వస్తుంది. వీటిలో ఉండే నీరు శరీరం నీరసించకుండా ఉండేలా చేస్తుంది. అలాగే శరీరానికి కావాల్సిన మినరల్స్, షుగర్,విటమిన్ బి, ఐరన్, క్యాల్షియం పోషకాలను సమపాళ్లలో అందిస్తాయి.

గర్భిణులు కూడా తాటిముంజలు తినడం వల్ల అజీర్తి వంటి సమస్యలను నివారించుకోవచ్చు. దీని వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలకు ఉపశమనాన్నిస్తాయి తాటి ముంజలు.

Also Read : గర్భిణులు ప్రయాణాలు చేయవచ్చా..?

తాటి ముంజలు తినడం వల్ల శరీర బరువు కూడా తగ్గుతుంది. వీటిలో శరీరానికి కావాల్సిన ఎ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం.. వంటివి పుష్కలంగా ఉంటాయి. ముంజలలో ఉండే నీరు శరీర బరువును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే చికెన్ పాక్స్ (పొంగు జ్వరం) వచ్చిన వారికి ఉండే దురద నుంచి కూడా ముంజలు ఉపశమనాన్నిస్తాయి.

మన శరీరంలో ఉండే విషపదార్థాలు, మలినాలు కూడా తాటి ముంజలు తినడం వల్ల యూరిన్ రూపంలో బయటికి వెళ్లిపోతాయి. వీటిలో ఉండే పొటాషియం ఇందుకు తోడ్పడుతుంది. కాలేయ సంబంధిత సమస్యల్ని కూడా తగ్గిస్తుంది.

వేసవి కాలంలో చాలామందికి వడదెబ్బ తాకడం వల్లో లేక..ప్రయాణాల సమయంలోనో వాంతులవుతుంటాయి. అలాంటివారు ఎక్కువగా నిమ్మరసం తాగేకన్నా..తాటి ముంజలు తినడం ఎంతో మేలు. వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంథోసయనిన్ లాంటి వాటిని కూడా తాటి ముంజలు నిర్మూలిస్తాయి. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి..శరీరానికి అవసరమయ్యే మినరల్స్, న్యూట్రియంట్ల శాతాన్ని బ్యాలన్స్ చేయడంలో కూడా ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి.

Also Read : కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..!

వేసవిలో తీవ్ర ఎండల్లో సైతం పనిచేసే వారు..ప్రయాణాలు చేసే వారు ఊరికే అలసిపోతుంటారు. అలాంటి సమయంలో మన శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటికి వచ్చేస్తుంది. అలాంటి సమయంలో శరీరానికి నీరందించే తాటిముంజలను తింటే అలసట నుంచి ఉపశమనంతో పాటు..శక్తి కూడా వస్తుంది.

చాలా మంది ముంజలపై గోధుమ రంగులో ఉండే పొట్టును తీసేసి ముంజలను తింటుంటారు. కానీ ఆ పొట్టులోనే చాలా పోషకాలుంటాయి. వాటిలో పీచుపదార్థం ఉంటుంది. ఈ పొట్టువల్లే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది.

మరి వేసవి రానే వచ్చింది. సిటీల్లో అమ్మే తాటి ముంజలు ఒక్కోసారి తాజాగా ఉండవు కాబట్టి..చూసి కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే తాజాగా దొరికే ముంజలు తినడం వల్లే ఈ ఉపయోగాలన్నీ ఉంటాయి గానీ..నిల్వ ఉంచినవి తినడం అంత మంచిది కాదు. ఎలాగూ వేసవి సెలవులకు మీ పిల్లలతో కలిసి మీ సొంతఊర్లకు వెళ్తారు కదా. అక్కడైతే ఏకంగా అప్పటికప్పుడు చెట్టునుంచి తీసిన ముంజలనే లాగించేయచ్చు.

Next Story