కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..!

By రాణి  Published on  9 March 2020 10:27 AM GMT
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..!

ఆరోగ్యమే మహాభాగ్యం..ఆరోగ్యంగా ఉంటే జీవితకాలం కూడా పెరుగుతుంది. ఎవరో అన్నట్లుగా..పేదవాడు ఆరోగ్యంగా ఉంటాడు కానీ..గొప్పగా బ్రతుకలేడు. గొప్పవాళ్ల బ్రతుకులో గొప్పే కనిపిస్తుంది కానీ ఆరోగ్యం కనిపించదు. ఎప్పుడూ ఏదొక సమస్యతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు.

అసలే వేసవి..దాహం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చే వేడిమిని తట్టుకోలేక ఏదైనా చల్లగా తాగాలనిపిస్తుంటుంది. అలా అనిపించగానే చాలా మంది కూల్ డ్రింక్స్, జ్యూస్ లు తాగుతుంటారు. వాటివల్ల ఆ కొద్దిసేపే చల్లగా అనిపిస్తుంది కానీ..తర్వాత శరీరంలో వేడి బాగా ఎక్కువవుతుంది. వాటికి బదులుగా కొబ్బరి నీళ్లు తాగితే..మనలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో ఉష్ణాన్ని తగ్గించడంతో పాటు దాహార్తిని కూడా తగ్గిస్తాయి. పైగా కూల్ డ్రింక్స్ తాగితే వాటిలో ఉండే వేల కొలది క్యాలరీల వల్ల శరీర బరువు పెరుగుతుంది. కానీ..ఎన్ని కొబ్బరి బొండాలు తాగినా శరీరంలో కొవ్వు పెద్దగా ఏర్పడదు. ఒక కొబ్బరి బొండాం ఒక సెలైన్ బాటిల్ తో సమానమట.

రెండో ప్రపంచ యుద్ధంలో సెలైన్ బాటిళ్ల కొరత ఏర్పడటంతో గాయపడిన వారికి సెలైన్ ఎక్కించడానికి బదులుగా కొబ్బరి బొండాలను తాగించారట. లేత కొబ్బరి బొండాల్లో 90-95 శాతం నీరు, 24 కేలరీల శక్తి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. 100 గ్రాముల కొబ్బరి నీటి నుంచి 17.4 కేలరీల ఎనర్జీ వస్తుంది. శతాబ్దం క్రితం అండమాన్ నికోబార్ దీవుల్లో డబ్బు బదులు కొబ్బరి బోండాలు ఇచ్చుకునేవారట. అలాగే మాల్దీవుల జాతీయ వృక్షం కొబ్బరి చెట్టు. కొబ్బరి నీటి వల్ల చాలా ప్రయోజనాలున్నాయి కాబట్టే..సెప్టెంబర్ 2ను ప్రపంచ కొబ్బరి దినోత్సవం(World Coconut Day)గా ప్రకటించారు.

కొబ్బరి నీరు తాగడం వల్ల వచ్చే ఫలితాలివే :

  • షుగర్ వ్యాధి ఉన్నవారు కొబ్బరి నీరు తాగడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే ఇన్సులిన్ లో వేగం పెరుగుతుంది. ఇందులోని మెగ్నీషియం టైప్ 2 డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ ఉన్నవారికి ఆ సమస్యలను తగ్గిస్తుంది.
  • గుండె జబ్బులకు కొబ్బరి నీళ్లు చెక్ పెడతాయి. వీలైనప్పుడల్లా ఒక బోండాం ఎత్తేయాలి. అప్పుడే హార్ట్ హ్యాపీగా ఉంటుంది.
  • కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చెయ్యడానికి కొబ్బరి నీళ్లు చేసినంత మేలు ఇంకేదీ చేయలేదు. మంచినీటి కన్నా కొబ్బరి నీరు బాగా పనిచేస్తుంది.
  • కొబ్బరి నీళ్లలో ఉండే పీచు పదార్థం శరీరానికి విటమిన్ సి, ఖనిజాలను పుష్కలంగా అందిస్తాయి. కాస్త నీరసంగా అనిపిస్తే..కొబ్బరి బొండం తాగేయండి..ఆటోమేటిక్ గా ఎనర్జీ వచ్చేస్తుంది.
  • సూక్ష్మక్రిములు, విష వ్యర్థాల నుంచీ కొబ్బరి నీళ్లు మనల్ని కాపాడతాయి. బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి.
  • రోజూ వ్యాయామం చేసే అలవాటున్నవారు వ్యాయామం పూర్తయ్యాక కొబ్బరినీళ్లు తాగాలి. అప్పుడు శరీరంలో నీరసాన్ని ఈ వాటర్ తగ్గిస్తాయి.
  • తల తిరగడం, కడుపులో గడబిడ వంటి వాటిని తరిమికొట్టడంలో కొబ్బరి నీళ్లకు మించిన ఔషధం మరొకటి లేదనే చెప్పాలి. ఎక్కవగా మందులు వాడే పనిలేకుండా..ఇలా అప్పుడప్పుడూ కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటే..చాలావరకు ఆరోగ్య సమస్యలు మీ దరిచేరవు.

దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని ఊరికే అనలేదు. సిటీల్లో అయితే కొబ్బరి బొండాలు ఏ రూ.30కో, రూ.50కో కొనుక్కోవాలి గానీ..పల్లెటూర్లలో ఆ అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతి ఇంటికో కొబ్బరి చెట్టు ఉంటుంది. ఒకవేళ ఇంట్లో లేకపోయినా చేలు(పొలాలు) గట్ల మీదుగా చాలా కొబ్బరిచెట్లుంటాయి. రూపాయి ఖర్చులేకుండా..తాగినవారికి తాగినన్ని కొబ్బరిబొండాలు ఫ్రీగా.

Also Read :నిద్రించే ముందు ఈ పనులు అస్సలు చేయకూడదు..!

Next Story